Sunglasses Safety Tips: మీ సన్‌గ్లాసెస్ అసలైనవేనా? నకిలీదా..? కేవలం 2 సెకన్లలో చెక్ చేయండి.. లేదంటే కళ్లకు ప్రమాదమే!

Sunglasses Safety Tips

Sunglasses Safety Tips

Sunglasses Safety Tips: వేసవిలో మండే ఎండలు, హానికరమైన యూవీ కిరణాల నుంచి కళ్లను రక్షించుకోవడానికి సన్‌గ్లాసెస్ ఎంతో అవసరం. అయితే ప్రస్తుతం మార్కెట్లో అసలైన బ్రాండెడ్ గ్లాసెస్ పేరుతో నకిలీ సన్‌గ్లాసెస్ కూడా భారీగా అమ్ముడవుతున్నాయి. బయటకు చూస్తే స్టైలిష్‌గా కనిపించినా, అవి కళ్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉంది. చాలామంది ధర, స్టైల్ చూసి వెంటనే కొనేస్తుంటారు. కానీ నిజంగా అవి UV రక్షణ కలిగిన పోలరైజ్డ్ గ్లాసెస్ కావా కాదా అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అదీ మీ స్మార్ట్‌ఫోన్ సహాయంతో కేవలం రెండు సెకన్లలోనే!

స్మార్ట్‌ఫోన్‌తో సన్‌గ్లాసెస్ అసలైనవో కాదో ఎలా తెలుసుకోవాలి?
పోలరైజ్డ్ సన్‌గ్లాసెస్‌లో ప్రత్యేక ఫిల్టర్ ఉంటుంది. ఇది కాంతి ప్రతిబింబాన్ని తగ్గించి కళ్లకు రక్షణ ఇస్తుంది. ఈ ఫిల్టర్ నిజంగా ఉందో లేదో మీ మొబైల్‌తో చెక్ చేయవచ్చు. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను ఆన్ చేయండి. ఇప్పుడు సన్‌గ్లాసెస్‌ను స్క్రీన్ ముందు పట్టుకుని నెమ్మదిగా 90 డిగ్రీల కోణంలో తిప్పండి. గ్లాసెస్ లెన్స్ ద్వారా కనిపించే స్క్రీన్ పూర్తిగా నల్లగా లేదా చీకటిగా మారితే, అవి అసలైన పోలరైజ్డ్ సన్‌గ్లాసెస్ అని అర్థం. అయితే స్క్రీన్‌లో ఎలాంటి మార్పు కనిపించకపోతే, ఆ గ్లాసెస్ నకిలీవి అయ్యే అవకాశం ఎక్కువ. అంటే దుకాణదారుడు మిమ్మల్ని మోసం చేసినట్టే.

నకిలీ సన్‌గ్లాసెస్ వల్ల ప్రమాదం ఏమిటి?
చాలామంది చౌకగా దొరికే సన్‌గ్లాసెస్ కూడా కళ్లను రక్షిస్తాయని అనుకుంటారు. కానీ వైద్య నిపుణులు దీనిపై హెచ్చరిస్తున్నారు. ముదురు రంగు గ్లాసెస్ ధరించినప్పుడు కళ్ల కనుపాపలు పెద్దవిగా మారి ఎక్కువ కాంతిని లోపలికి అనుమతిస్తాయి. అలాంటి సమయంలో UV రక్షణ లేని నకిలీ గ్లాసెస్ ధరిస్తే, సూర్యుని హానికరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా రెటీనాపై ప్రభావం చూపుతాయి. ఇది కంటి శుక్లాలు, చూపు మందగించడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. కొన్ని సందర్భాల్లో శాశ్వత కంటి నష్టం కూడా కలగొచ్చు.

సన్‌గ్లాసెస్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
* కంటి నిపుణుల సూచనల ప్రకారం, సన్‌గ్లాసెస్ కొనేటప్పుడు కేవలం స్టైల్ లేదా బ్రాండ్ మాత్రమే కాకుండా UV రక్షణ ఉందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేయాలి.
* UV 400 స్టిక్కర్ లేదా ట్యాగ్ ఉందో చూడాలి
* 99 నుంచి 100 శాతం UV కిరణాలను అడ్డుకునే గ్లాసెస్‌ను ఎంచుకోవాలి
* బూడిద, ఆకుపచ్చ లేదా ముదురు గోధుమ రంగు లెన్స్‌లు కళ్లకు ఎక్కువ సౌకర్యాన్ని ఇస్తాయి
* రోడ్డు పక్కన చౌకగా దొరికే గ్లాసెస్ కొనకుండా జాగ్రత్తపడాలి

వేసవిలో కళ్ల రక్షణ చాలా ముఖ్యమైనది. కాబట్టి స్టైల్ కంటే ముందు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.