లెదర్ వాచ్ పట్టీలు చేతికి ఎంతో ఆకర్షణీయంగా, ధరించడానికి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. అయితే, రోజువారీ వాడకంతో చెమట, దుమ్ము , చర్మం నుండి వచ్చే సహజ నూనెలు పట్టీపై పేరుకుపోయి, దాని రంగు మారడానికి కారణమవుతాయి. సరిగ్గా నిర్వహించకపోతే పట్టీ నుండి దుర్వాసన రావడం, కాలక్రమేణా లెదర్ ఎండిపోవడం, గట్టిపడడం లేదా పగుళ్లు ఏర్పడడం వంటి సమస్యలు వస్తాయి. అయితే వీటిని శుభ్రం చేయడానికి మార్కెట్లో లభించే ఖరీదైన క్లీనర్లను కొనవలసిన అవసరం లేదు. కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇంట్లోనే మీ లెదర్ వాచ్ పట్టీని సరికొత్తగా మార్చుకోవచ్చు.
శుభ్రపరిచే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మొదటగా మీ వాచ్ పట్టీ అసలైన తోలు, సింథటిక్ తోలు లేదా స్వెడ్తో తయారు చేయబడిందో లేదో నిర్ధారించుకోవడం ముఖ్యం. ప్రతి రకమైన పదార్థానికి తగిన సంరక్షణ పద్ధతి భిన్నంగా ఉంటుంది. ఇతర వాచ్ పట్టీల వలె కాకుండా లెదర్ పట్టీలను నీటిలో నానబెట్టి ఉతకకూడదు. అధిక తేమ, ప్రత్యక్ష సూర్యరశ్మి , అనుచితమైన శుభ్రపరిచే ఉత్పత్తులు లెదర్ నాణ్యతను దెబ్బతీస్తాయి.
తొలుత పట్టీపై ఉన్న దుమ్ము , మురికిని తొలగించడానికి మృదువైన మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించి పైభాగం, కిందిభాగం, అంచులు , బకిల్ ప్రాంతాలను సున్నితంగా తుడవాలి. కుట్లలో లేదా బకిల్ రంధ్రాలలో మురికి ఉంటే మృదువైన బ్రష్‌ను ఉపయోగించవచ్చు. పట్టీకి చెమట లేదా కొద్దిగా మురికి అంటుకుంటే, ఒక శుభ్రమైన గుడ్డను నీటితో కొద్దిగా తడిపి, నీరు కారకుండా బాగా పిండేసి తుడవాలి. మురికి సులభంగా పోకపోతే తోలుకు సురక్షితమైన క్లీనర్‌ను ఉపయోగించవచ్చు.
ఈ పొరపాట్లు అసలు చేయవద్దు
లెదర్ వాచ్ పట్టీపై ఉన్న మరకలను తొలగించడానికి సబ్బు, డిటర్జెంట్లు లేదా కఠినమైన గృహ రసాయనాలను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్, బ్లీచ్ లేదా వెనిగర్ వాడటం వల్ల లెదర్ రంగు , ఉపరితలం దెబ్బతింటాయి. పట్టీని శుభ్రపరిచిన తర్వాత పొడి మైక్రోఫైబర్ వస్త్రంతో తేమను తుడిచి, గాలి తగిలే నీడ ఉన్న ప్రదేశంలో సహజంగా ఆరనివ్వాలి. హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగించడం లేదా నేరుగా సూర్యరశ్మిలో ఉంచడం వంటివి చేయకూడదు. అధిక వేడి వల్ల తోలు పొడిబారి పగుళ్లు రావచ్చు. అలాగే లెదర్ స్ట్రాప్‌ను కాపాడేందుకు కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, వంట నూనె లేదా పెట్రోలియం జెల్లీని అస్సలు వాడకూడదు. ఇవి పట్టీపై జిడ్డు పొరను ఏర్పరచి మరింత త్వరగా మురికి పట్టేలా చేస్తాయి. తయారీదారు సూచనల మేరకు అవసరమైతే మాత్రమే లెదర్ కండీషనర్‌ను వాడాలి.
దుర్వాసన రాకుండా తగు జాగ్రత్తలు
ప్రతిరోజూ ఎక్కువసేపు లెదర్ వాచ్ పట్టీ ఉన్న వాచీలు ధరించేవారికి చెమట కారణంగా దుర్వాసన రావచ్చు. దీనిని నివారించడానికి వాచీని తీసివేసిన తర్వాత పట్టీని మృదువైన పొడి గుడ్డతో తుడవాలి. స్నానం చేసేటప్పుడు, ఈత కొట్టేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు లెదర్ పట్టీ వాచీని ధరించకపోవడమే మంచిది. పెర్ఫ్యూమ్, బాడీ లోషన్ లేదా సన్‌స్క్రీన్ రాసుకున్న వెంటనే వాచీ ధరించడం మానుకోవాలి. జపాన్‌కు చెందిన సైకో వాచ్ కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం.. తేమ, చెమట , ప్రత్యక్ష సూర్యరశ్మి కారణంగా తోలు పట్టీలు రంగుమారి దెబ్బతింటాయి. అలాగే జర్నల్ ఆఫ్ ది అమెరికన్ లెదర్ కెమిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రచురితమైన అధ్యయనం కూడా ఉష్ణోగ్రత, తేమ , అతినీలలోహిత (UV) వికిరణం లెదర్ క్షీణతకు కారణమవుతాయని స్పష్టం చేసింది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ లెదర్ వాచ్ పట్టీ ఎక్కువ కాలం కొత్తదానిలా మెరిసిపోతుంది.

