Silver Cleaning Tips: వెండి ఆభరణాలు, పూజా పాత్రలు కొంతకాలం ఉపయోగించిన తర్వాత లేదా నిల్వ ఉంచినప్పుడు నల్లబడటం సహజం. దీంతో చాలామంది వాటిని శుభ్రం చేయడానికి ఖరీదైన క్లీనింగ్ లిక్విడ్లు లేదా పాలిష్‌లను కొనుగోలు చేస్తుంటారు. అయితే మాస్టర్‌చెఫ్ పంకజ్ భదోరియా తెలిపిన సులభమైన ఇంటి చిట్కాతో కేవలం 20 నిమిషాల్లోనే వెండి వస్తువులకు తిరిగి కొత్త మెరుపును తీసుకురావచ్చు. వెండి గాలిలోని సల్ఫర్, తేమతో చర్యకు లోనవడం వల్ల దాని ఉపరితలంపై నల్లటి పొర ఏర్పడుతుంది. దీనినే ‘టార్నిష్’ అంటారు. ఇది మురికి కాదు. సరైన పద్ధతిలో శుభ్రం చేస్తే వెండి మళ్లీ మెరిసిపోతుంది.
వెండిని మెరిపించే విధానం..!
ఈ పద్ధతికి ఒక పెద్ద గిన్నె, అల్యూమినియం ఫాయిల్, వేడి నీరు, ఒకటి లేదా రెండు టీస్పూన్ల ఉప్పు, ఒకటి లేదా రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా, మృదువైన పొడి వస్త్రం అవసరం. ముందుగా గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ పరచి వేడి నీరు పోయాలి. అందులో ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత వెండి ఆభరణాలు లేదా పాత్రలను అందులో ముంచి సుమారు 20 నిమిషాల పాటు కదపకుండా ఉంచాలి. అనంతరం బయటకు తీసి మృదువైన వస్త్రంతో శుభ్రంగా తుడిస్తే వెండికి తిరిగి మెరుపు వస్తుంది. ఈ పద్ధతిలో అల్యూమినియం ఫాయిల్, ఉప్పు, బేకింగ్ సోడా మధ్య జరిగే రసాయన చర్య వల్ల వెండి ఉపరితలంపై ఉన్న నల్లటి పొర తొలగిపోతుంది. ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేకుండానే మంచి ఫలితం కనిపిస్తుంది.
అయితే చాలా ఖరీదైన, పురాతన లేదా చెక్కిన వెండి వస్తువులపై ఈ పద్ధతిని ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే ముత్యాలు, విలువైన రాళ్లు అమర్చిన ఆభరణాలను ఈ ద్రావణంలో వేయకూడదు. శుభ్రం చేసిన తర్వాత వెండిని పూర్తిగా ఆరబెట్టి భద్రపరిస్తే మళ్లీ త్వరగా నల్లబడకుండా ఉంటుంది.

