Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!

  • వెనిగర్–బేకింగ్ సోడాతో సింపుల్ క్లీనింగ్
  • డ్రెయిన్‌లోని జిడ్డు, మురికి తొలగించే పద్ధతి
  • దుర్వాసనకు కూడా చెక్ పెట్టొచ్చు
  • వారానికి ఒకసారి చేస్తే జామ్‌కు గుడ్‌బై
Bathroom Drain Cleaning Tip

Bathroom Drain Cleaning Tip

Bathroom Drain Cleaning Tips : ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో బాత్రూమ్ పరిశుభ్రత చాలా ముఖ్యమైనది. అయితే చాలామంది ఇళ్లలో బాత్రూమ్ డ్రెయిన్ తరచూ వెంట్రుకలు, సబ్బు అవశేషాలు, బాడీ వాష్ , మురికి వల్ల అడ్డుపడి నీరు నెమ్మదిగా వెళ్లడం లేదా దుర్వాసన రావడం జరుగుతుంటుంది. మార్కెట్లో దొరికే ఘాటైన రసాయన క్లీనర్లు పైపులను దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. దీనికి ప్రత్యామ్నాయంగా మన వంటగదిలో ఉండే తెల్ల వెనిగర్ , బేకింగ్ సోడాలతో డ్రెయిన్ అడ్డంకులను పర్యావరణానికి హాని లేని పద్ధతిలో చాలా సులభంగా తొలగించుకోవచ్చు.

బాత్రూమ్ డ్రెయిన్‌ క్లీన్ చేయడానికి సరైన పద్ధతి

డ్రెయిన్‌ను శుభ్రం చేయడానికి ముందుగా డ్రెయిన్ జాలిపై ఉన్న వెంట్రుకలు, పెద్ద చెత్తను తొలగించాలి. ఆ తర్వాత డ్రెయిన్‌లో ఒక కప్పు బేకింగ్ సోడా వేసి, దానిపై ఒక కప్పు తెల్ల వెనిగర్ పోయాలి. ఇవి రెండూ కలవగానే నురుగు, బుడగలు వస్తాయి. ఈ మిశ్రమాన్ని 15 నుండి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అనంతరం మరుగుతున్న వేడి నీటిని డ్రెయిన్‌లో పోస్తే, లోపల వదులైన మురికి , జిడ్డు కొట్టుకుపోతాయి. డ్రెయిన్ జామ్ కాకుండా ఉండటానికి ఈ పద్ధతిని వారానికి ఒకసారి లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి పాటించడం మంచిది.

వెనిగర్ , బేకింగ్ సోడా వల్ల కలిగే ఉపయోగాలు

ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు సబ్బు అవశేషాలు, నీటిలోని ఖనిజాలు కలిసి డ్రెయిన్ పైపు గోడలకు గట్టి పొరలా అంటుకుంటాయి. వెనిగర్‌లోని ఆమ్ల గుణాలు ఈ గట్టి పొరను సున్నితంగా కరిగించి పైపులను శుభ్రపరుస్తాయి. అలాగే డ్రెయిన్‌లలో ఉండే తేమ వల్ల బ్యాక్టీరియా చేరి దుర్వాసన, కీటకాలు పెరుగుతుంటాయి. వెనిగర్‌లోని ఎసిటిక్ యాసిడ్ దుర్వాసనకు కారణమయ్యే క్రిములను నశింపజేసి, బాత్రూమ్‌ను హాయిగా ఉంచుతుంది. మార్కెట్లో దొరికే రసాయన క్లీనర్లలో ఉండే ఘాటైన ఆమ్లాలు ప్లంబింగ్ పైపులను లోపలి నుండి పాడేస్తాయి, కానీ వెనిగర్, బేకింగ్ సోడాల కలయిక ఎలాంటి హాని చేయని పూర్తి సురక్షితమైన మార్గం.

దీని వెనుక ఉన్న అసలు కారణం

పరిశోధనల ప్రకారం, ఆమ్ల స్వభావం కలిగిన వెనిగర్ , క్షార స్వభావం కలిగిన బేకింగ్ సోడా ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఒక రసాయన చర్య జరుగుతుంది. ఈ ప్రక్రియలో విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు నురుగు రూపంలో వచ్చి పైపుల్లో గట్టిగా పేరుకుపోయిన మురికిని, చిన్న చిన్న అడ్డంకులను వేగంగా వదులు అయ్యేలా చేస్తుంది.