Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!

  • నాన్‌వెజ్ కీమాను తలపించే రుచికరమైన సోయా వెజ్ కీమా..
  • సోయా చంక్స్‌తో ఇంట్లోనే సులభంగా తయారీ..
Veg Keema

Veg Keema

Soya Veg Keema Recipe: సాధారణంగా నాన్‌వెజ్ ప్రియులకు ‘కీమా’ అంటే ఎంతో ఇష్టం. కానీ శాఖాహారులు, నాన్‌వెజ్ ముట్టని వారు లేదా కార్తీక మాసం, శ్రావణ మాసం లాంటి పవిత్ర సమయాల్లో మాంసాహారానికి దూరంగా ఉండేవారు చాలా మిస్ అవుతుంటారు. అలాంటి వారి కోసం అచ్చం నాన్‌వెజ్ కీమాను తలపించేలా.. అంతకంటే రుచిగా, హై-ప్రొటీన్‌తో నిండిన అద్భుతమైన వంటకం “సోయా కీమా”.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తినే ఈ రుచికరమైన “సోయా వెజ్ కీమా”ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

సోయా కీమా కోసం:

* సోయా చంక్స్ / మిల్ మేకర్: 1 కప్పు
* నీరు: ఉడికించడానికి సరిపడా

మసాలా & తాలింపు కోసం:

* నూనె: 2 టేబుల్ స్పూన్లు
* గరం మసాలా: దాల్చిన చెక్క (1 ఇంచు), లవంగాలు (3-4), యాలకులు (2), బిర్యానీ ఆకు (1), అనాస పువ్వు (1), మిరియాలు (కొద్దిగా)
* ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
* అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
* టమాటా ప్యూరీ: 2 మీడియం సైజ్ టమాటాల గుజ్జు
* కారం పొడి: ½ టీ స్పూన్ (మీ కారానికి తగినంత)
* ధనియాల పొడి: 1 టీ స్పూన్
* లవంగాల పొడి / జీలకర్ర పొడి: 1 టీ స్పూన్
* పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు: రుచికి సరిపడా
* నీరు: ¾ కప్పు నుండి 1 కప్పు వరకు

రెస్టారెంట్ టచ్ & గార్నిషింగ్ కోసం:

* గరం మసాలా పొడి: 1 టీ స్పూన్
* కసూరి మేథీ: 1 టీ స్పూన్ (చేతితో నలిపినది)
* ఫ్రెష్ క్రీమ్ లేదా పాలు: ½ టేబుల్ స్పూన్ (ఐచ్ఛికం)
* వెన్న (బటర్): ½ టేబుల్ స్పూన్

తయారీ విధానం

సోయా కీమా సిద్ధం చేసుకోవడం

ముందుగా ఒక గిన్నెలో నీటిని మరిగించి, అందులో ఒక కప్పు సోయా మిల్క్ మేకర్‌ను వేసి బాగా ఉడికించుకోవాలి. అవి చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపి కాసేపు చల్లారనివ్వాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, అందులోని నీటిని చేతులతో గట్టిగా పిండి తీసేయాలి. ఇప్పుడు ఈ సోయాను మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా, కీమా లాంటి ముతక టెక్స్చర్ వచ్చేలా ఒక్కసారి మాత్రమే పల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మార్కెట్‌లో దొరికే పెద్ద సైజ్ సోయా చంక్స్ వాడుతుంటే, వాటిని ఉడికించి నీరు పిండిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు.

మసాలా గ్రేవీ తయారీ

ఇప్పుడు ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మిరియాలు వంటి హోల్ గరం మసాలా దినుసులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి చక్కటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అనంతరం అల్లం-వెల్లుల్లి పేస్ట్ చేర్చి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆపై టమాటా ప్యూరీతో పాటు ధనియాల పొడి, కారం, లవంగాల పొడి వేసి బాగా కలపాలి. ఈ టమాటా గ్రేవీ బాగా ఉడికి, నూనె పైకి తేలే వరకు మీడియం మంటపై మగ్గనివ్వాలి. గ్రేవీ చక్కగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయాలి.

కీమా ఉడికించడం & ఫైనల్ టచ్

ఇలా సిద్ధమైన గ్రేవీలో ముందుగా తయారు చేసుకున్న సోయా కీమాను వేసి, మసాలాలన్నీ పట్టేలా బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత సుమారు ¾ కప్పు నుండి 1 కప్పు వరకు నీరు పోసి, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటపై సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి. గ్రేవీ చక్కగా చిక్కబడి, పైకి నూనె తేలిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, చేతితో నలిపిన కసూరి మేథీ వేసుకోవాలి. చివరగా మంచి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్, రిచ్ టెక్స్చర్ కోసం అర టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ (లేదా కాచిన పాలు) మరియు అర టేబుల్ స్పూన్ వెన్న (బటర్) వేసి బాగా కలిపి స్టవ్ ఆపేస్తే ఎంతో రుచికరమైన సోయా కీమా సిద్ధమవుతుంది.