Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?

Poori

Poori

Soft and Puffy Poori: చాలామంది ఇంట్లో పూరీలు చేసుకునేటప్పుడు అవి సరిగ్గా పొంగకపోవడం లేదా కొద్దిసేపటికే గట్టిపడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. హోటళ్లలో లభించే విధంగా పూరి నూనెలో వేయగానే గుండ్రంగా బుడగలా పొంగి, ఎక్కువ సేపు ఎంతో మెత్తగా ఉండాలంటే పిండి కలిపే విధానం నుంచి కాల్చే వరకు కొన్ని సరైన మెళకువలు పాటించాలి. సరైన కొలతలు, సరైన పద్ధతి పాటిస్తే ఇంట్లోనే రుచికరమైన, మృదువైన పూరీలను సులభంగా తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

* గోధుమ పిండి: 2 కప్పులు,
* బొంబాయి రవ్వ (సూజీ): అర కప్పు,
* పాలు: అర కప్పు,
* పంచదార: 1 టీస్పూన్,
* ఉప్పు: 1 టీస్పూన్,
* నీళ్లు: తగినన్ని,
* నూనె: డీప్ ఫ్రైకి సరిపడా..

పిండిని సిద్ధం చేసుకునే విధానం

ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పాలు, పంచదార, ఉప్పు వేసి అన్ని పదార్థాలు కలిసేలా ముందుగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ జోరుగా కాకుండా మృదువుగా ఒత్తుకోవాలి. ముఖ్యంగా పిండి కలిపే సమయంలో నూనె అస్సలు వాడకూడదు. పిండిలో నూనె వేసి కలిపితే పూరీలు కాల్చేటప్పుడు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. పిండి ముద్దను చక్కగా ఒత్తుకున్న అనంతరం దానిపై మూత ఉంచి కనీసం 15 నిమిషాల పాటు నాననివ్వాలి.

పూరీలను ఒత్తుకునే సరైన పద్ధతి

నానిన పిండిని సమాన పరిమాణంలో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూరీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ పూరీ కర్రతో గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పూరీని మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ మందంగా కాకుండా కొద్దిపాటి మందంగా ఉండేలా మీడియం సైజులో ఒత్తుకోవాలి. మరీ పలుచగా చేస్తే పూరి నూనెలో సరిగ్గా పొంగదు. అదే తగినంత మందంతో ఉంటే నూనెలో వేయగానే చక్కగా ఉబ్బుతుంది.

కాల్చే పద్ధతి

పూరీలు వేయించడానికి బాండీలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె సరిగ్గా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఒత్తుకున్న పూరిని నూనెలో వేయాలి. పూరి వేసిన వెంటనే గరిటెతో నూనెలో మునిగేలా తేలికగా అదుముతూ ఉండాలి. ఇలా నొక్కడం వల్ల పూరి చుట్టూ సమానంగా వేడి తగిలి వెంటనే బుడగలా పైకి పొంగుతుంది. ఒకవైపు కాలిన వెంటనే రెండో వైపు తిప్పి తేలికగా వేయించి వెంటనే తీసేయాలి.

ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే..

పూరీలను నూనెలో ఎక్కువ సేపు వేయించకూడదు. ఎక్కువ సేపు ఉంచితే అవి గట్టిపడి క్రిస్పీగా మారిపోతాయి. పూరి పొంగిన వెంటనే రెండో వైపు తిప్పి తీసేస్తే లోపల ఎంతో సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే కాల్చిన పూరీలను వెంటనే ఒక హాట్‌బాక్స్‌లో వేసి మూత పెట్టేయాలి. హాట్‌బాక్స్‌లో ఆవిరి పట్టడం వల్ల పూరీలు ఎక్కువ సేపు చల్లారినా కూడా గట్టిపడకుండా దూదిలా మెత్తగా ఉంటాయి. ఈ సులభమైన చిట్కాలతో ఇంట్లోనే పర్ఫెక్ట్ పూరీలను తయారు చేసుకోవచ్చు.