Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్‌గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!

  • రోజూ తినే ఇడ్లీ, దోశలకు బదులుగా..
  • రాగి-పోహా రోటీని ట్రై చేయండి..
Ragi Poha Roti

Ragi Poha Roti

Ragi Poha Roti: మన పూర్వీకులు రాగులను ప్రధాన ఆహారంగా తీసుకుని ఎంతో బలంగా ఉండేవారు. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కాల్షియం లోపం, పోషకాహార లోపం సర్వసాధారణమైపోయింది. అందుకే పిల్లలకి నచ్చేలా కూరగాయలు, అటుకులు కలిపి ఈ విధంగా రాగి రోటీ చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి దక్కుతాయి. రోజూ తినే ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టి, బరువు తగ్గేందుకు మంచి డైట్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వెతుకుతున్నారా.? అయితే పోహా, రాగి పిండి కాంబినేషన్ మీ కోసమే.. క్యాలరీలు తక్కువగా ఉండి, ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూసే ఈ రోటీ శరీరానికి మంచి ఎనర్జీని ఇస్తుంది. మరి దీనిని ఎలా చేయాలో చూద్దామా..

కావలసిన పదార్థాలు:

* రాగి పిండి – 1 కప్పు
* అటుకులు (పోహా) – ½ కప్పు
* ఉల్లిపాయ – 1 (చిన్న ముక్కలుగా తరిగినది)
* క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు
* పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర, కరివేపాకు – కొద్దిగా
* ఉప్పు – తగినంత
* నూనె – కాల్చడానికి సరిపడా
* నీళ్లు – పిండి కలపడానికి తగినన్ని

తయారీ విధానం:

ముందుగా ఒక బౌల్‌లో అటుకులను తీసుకుని శుభ్రంగా రెండు సార్లు కడగాలి. నీరంతా వంపేసి, కేవలం 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. అలా నానిన అటుకులను చేత్తో మెత్తగా మెదపాలి. అందులో రాగి పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేయాలి (ఇష్టమైతే క్యాప్సికం, క్యాబేజీ కూడా కలుపుకోవచ్చు). కూరగాయల్లోని తేమతో మొదట బాగా కలిపి, ఆపై అవసరమైనన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి.

ఇప్పుడు బటర్‌ పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ లేదా అరిటాకుపై కొద్దిగా నూనె రాసి, పిండి ముద్దను ఉంచి చేత్తో గుండ్రంగా, మరీ పల్చగా కాకుండా రోటీలా ఒత్తుకోవాలి. స్టవ్‌పై పెనం వేడి చేసి, కాస్త నూనె రాయాలి. ఒత్తుకున్న రోటీని పెనంపై వేసి, కొద్దిగా నూనె చల్లి మూత పెట్టి నిమిషం పాటు లో-ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. తర్వాత రెండో వైపుకు తిప్పి, అట్లకాడతో లైట్‌గా ప్రెస్ చేస్తూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. అంతే వేడి వేడి “రాగి-పోహా రోటీ” రెడీ..

ఆరోగ్య ప్రయోజనాలు:

ఎముకల పుష్టికి అవసరమైన కాల్షియం, శరీరానికి బలాన్నిచ్చే ఐరన్ రాగి పిండిలో పుష్కలంగా లభిస్తాయి. ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది చక్కటి ఎంపిక. ఇంకా అటుకులు త్వరగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.