NTV Telugu Site icon

Premature Babies Problems : ప్రిమెచ్యూర్‌ బేబీస్‌… సమస్యలూ, పరిష్కారాలు

Srilatha Puli

Srilatha Puli

తొమ్మిది నెలలు కడుపున మోయడం అన్న నానుడి అందరికీ తెలిసిన మాటే. ‘నెల తక్కువ పిల్లాడా’ అంటూ అనే మాటా అందికీ తెలిసిన తిట్టే.

ఓ మహిళ గర్భం ధరించాక బిడ్డ కడుపులో ఉండే కాలం తొమ్మిది నెలలు. డాక్టర్లు మాట్లాడుకునే వారాల పరిభాషలో చెప్పాలంటే 36 వారాలు. ఇక 37 వారంలో ప్రసవం అవుతుంది. ఇలా 36 వారాలు… అంటే తొమ్మిది నెలలు బిడ్డ గర్భంలో ఉంటే దాన్ని ‘ఫుల్‌ టర్మ్‌’ ప్రెగ్నెన్సీ… అప్పుడయిన ప్రసవాన్ని ‘ఫుల్‌ టర్మ్‌ డెలివరీ’ అంటారు. కానీ కొందరిలో ఈ లోపే ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. అలా నెలల పూర్తిగా నిండకుండా ముందే ప్రసవం అయితే దాన్ని ‘ప్రీ మెచ్యూర్‌ డెలివరీ’ అనీ, అలా పుట్టిన బిడ్డలను ‘ప్రి మెచ్యూర్‌ బేబీస్‌’ లేదా ‘ప్రీ–టర్మ్‌ బేబీస్‌’ అంటారు. నవంబరు 17న ‘వరల్డ్‌ ప్రీ–మెచ్యురిటీ డే’ అయిన సందర్భంగా ప్రీ–టర్మ్‌ బేబీస్‌ ఎందుకిలా ముందే పుడతారు, మామూలు చిన్నారులతో పోల్చినప్పుడు వాళ్లకు వచ్చే సమస్యలేమిటి, వాటిని అధిగమించడమెలాగో చూద్దాం.

ప్రీ మెచ్యుర్‌ బేబీస్‌ పుట్టడానికి కారణాలు…

ప్రీమెచ్యుర్‌ బేబీస్‌ పుట్టడానికి అనేక అంశాలు కారణమవుతాయి. వాటిల్లో కొన్ని…

– తల్లి వయసు మరీ తక్కువ లేదా మరీ ఎక్కువ కావడం.
– గర్భందాల్చిన మహిళలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం.
– తల్లికి హై–బీపీ లేదా షుగర్‌ వంటి వ్యాధులు ఉండటం.
– కాబోయే తల్లి జననేంద్రియ భాగాల్లో ఇన్ఫెక్షన్స్‌ రావడం.
– గర్భస్త పిండంలో ఏవైనా సమస్యలు రావడం.

ఇవన్నీ ప్రీ–మెచ్యూర్‌ బేబీ పుట్టడానికి కొన్ని కారణాలు. అయితే కొందరిలో ఎలాంటి కారణాలు లేకుండానే ప్రీమెచ్యూర్‌ బేబీ పుట్టవచ్చు. ఇలా జరిగి పుట్టిన పిల్లల్ని ‘ఇడియోపథిక్‌ ప్రీ–టర్మ్‌ బేబీస్‌’గా చెబుతారు. నెలలు పూర్తిగా నిండాక పుట్టిన పిల్లల బరువు కనీసం 2500 గ్రాముల బరువుకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. అంతకంటే బాగా తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని ‘లో బర్త్‌ వెయిట్‌ బేబీస్‌’ గా చెబుతారు. సాధారణంగా ప్రీమెచ్యూర్‌ డెలివరీలో పుట్టే పిల్లల బరువు ఇలా చాలా తక్కువగా ఉంటుంది. (అయితే కొన్ని అంశాలు, ఆరోగ్యకారణాలతో మామూలుగా పుట్టే పిల్లలూ తక్కువ బరువుతో పుట్టవచ్చు లేదా గర్భాశయంలో బిడ్డ సరిగా పెరగకపోవడం వల్లనైనా ఇలా కావచ్చు).

ప్రీ–మెచ్యూర్‌ బేబీస్‌లో కనిపించే సమస్యలు…
సాధారణంగా ప్రీ–మెచ్యూర్‌ బిడ్డల్లో అన్ని అవయవాలూ పూర్తిగా రూపుదిద్దుకోకపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘ఇమెచ్యూర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్గన్స్‌ అండ్‌ ఆర్గన్‌ సిస్టమ్స్‌’ అంటారు. దాంతో ప్రీ–మెచ్యుర్‌గా పుట్టిన పిల్లల్లో కొన్ని అవయవాలకు సంబంధించిన లోపాలు ఉండవచ్చు. ఇందులో ప్రధానంగా కనిపించేవి శ్వాసకోశ సమస్యలు. కారణం… ఈ పిల్లల్లో ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు. దాంతో ‘రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌’ వంటి లంగ్స్‌ లోపాలు రావచ్చు. గుండె సమస్యలూ ఎక్కువే. ప్రధానంగా ‘పేటెంట్‌ డక్టస్‌ ఆర్టీరియస్‌ (పీడీఏ) అనేవి గుండె సమస్యల్లో ఎక్కువగా ఉండవచ్చు. ఇక జీర్ణవ్యవస్థకు వస్తే… పేగులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘నెక్రొటైజింగ్‌ ఎంటరోకొలైటిస్‌’– ‘ఎన్‌యీసీ’) అంటారు. కొందరిలో మెదడులోని అతి సున్నితమైన కొన్ని రక్తనాళాలు చిట్లే అవకాశాలుంటాయి. ఈ సమస్యను ‘ఇంట్రావెంట్రిక్యులార్‌ హేమరేజ్‌’ (ఐవీహెచ్‌)గా చెబుతారు.

ప్రీ–మెచ్యూర్‌ బేబీస్‌ సమస్యల నివారణ సాధ్యమేనా?
హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ కేసుల్లోని మహిళలకు 34 వారాల లోపు ప్రసవం జరిగే ప్రమాదం ఉన్నప్పుడు, గర్భవతికి కొన్ని ఇంజెక్షన్స్‌ (స్టెరాయిడ్‌ కోర్స్‌) ఇచ్చి, పుట్టబోయే ప్రీ–మెచ్యూర్‌ బేబీకి వచ్చే కొన్ని సమస్యలను కొంతవరకు అధిగమించేందుకు అవకాశం ఉంది.

పుట్టిన ప్రతి ప్రీమెచ్యూర్‌ బేబీకీ… సమస్యలు తప్పనిసరిగా ఉంటాయా?
ప్రీమెచ్యూర్‌ బేబీస్‌లో సాధారణంగా కనిపించే సమస్యలూ, వాటి తీవ్రత ఎంత అన్న అంశం… బిడ్డ ఎంత ప్రీ–మెచ్యూర్‌గా పుట్టిందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 34–37 వారాల్లో పుట్టిన పిల్లలతో పోలిస్తే… 32 వారాలలోసే పుట్టిన పిల్లలకు ప్రీ–మెచ్యురిటీకి సంబంధించిన సమస్యలు ఎక్కువ. అయితే… ప్రీ–మెచ్యూరిటీకి సంబంధించిన అన్ని సమస్యలూ తప్పనిసరిగా ఒక బేబీలో ఉండకపోవచ్చు. ఒక పాపకు ఒకటో, రెండో సమస్యలు ఉంటే… మరో చిన్నారిలో అన్ని సమస్యలూ ఉండవచ్చు.

పుట్టిన ప్రతి ప్రీ–టర్మ్‌ బేబీకీ ఎన్‌ఐసీయూ కేర్‌ అవసరమా?
అప్పుడే పుట్టిన బిడ్డలను ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చేయాల్సిన చికిత్సను ‘నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌’ (ఎన్‌ఐసీయూ) అనే ప్రత్యేక ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్స అందిస్తారు. దీన్నే ‘ఎన్‌ఐసీయూ’ కేర్‌గా చెబుతారు. దీనికో కొండగుర్తు ఉంటుంది. ముప్ఫయి ఐదు వారాలలోపు పుట్టిన ప్రిమెచ్యూర్‌ బేబీస్‌తో పాటు, రెండు కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ‘ఎన్‌ఐసీయూ’లో ఉంచి చేసే చికిత్స, దానితో పాటు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది. ఎన్‌ఐసీయూలో బిడ్డను ఎంతకాలం ఉంచాలన్నది… బిడ్డ ఎంత ప్రీ–మెచ్యూరిటీతో పుట్టింది, దానివల్ల వచ్చే పరిణామాలేమిటి, వాటి తీవ్రత ఎంత, అనే అంశాల ఆధారంగా ఉంటుంది.

ప్రీ టర్మ్‌ బేబీస్‌పై అపోహలు:
నెలలు పూర్తిగా నిండకముందే పుట్టిన పిల్లలు కొంత మందకొడిగా ఉంటారని చాలామందిలో ఓ దురభిప్రాయం ఉంటుంది. ఇదో అపోహ మాత్రమే. ప్రపంచ ప్రఖ్యాత మేధావులూ, కళాకారులు, రాజకీయ దురంధరుల్లో చాలామంది నెలలు నిండకముందే పుట్టినవాళ్లున్నారు. అందుకే ఇది పూర్తిగా ఓ అపోహ మాత్రమే.

డెలివరీ ఎక్కడ జరిగితే మేలు…
హైరిస్క్‌ ప్రెగ్నెన్సీతో పాటు ప్రీమెచ్యూర్‌ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీ, అంటే ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూసుకోవాలి. అందునా అన్ని అధునాతన సౌకర్యాలు ఉండే పెద్ద ఆసుపత్రుల్లో ప్రసవమయ్యేలా చూసుకోవడం ఇంకా మేలు. ప్రసవానికి చాలా ముందుగానే, గర్భవతిని ఆసుపత్రిలో చేర్పించి డెలివరీ చేస్తే, తల్లితో పాటు పుట్టబోయే ప్రీ–మెచ్యూర్‌ బేబీకి కూడా ప్రయోజనం చేకూరుతుంది. దీన్నే ‘ఇన్‌–యుటెరో ట్రాన్స్‌ఫర్‌’ అంటారు. పెద్ద పెద్ద నగరాల్లో తప్ప… రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాల్లో ఈ సౌకర్యాలు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కనీసం రోజుల పిల్లలకు చికిత్స అందించే నియోనేటాలజిస్ట్‌ల ఆధ్వర్యంలో డెలివరీ, పుట్టాక కొంతకాలం వారి పర్యవేక్షణ ఉండే చోట ప్రసవం అయ్యేలా చూసుకోవడం మేలు.

ప్రీ–మెచ్యూర్‌ బేబీకి అందాల్సిన సాధారణ చికిత్సలు…
ప్రీ–మెచ్యూర్‌ బేబీస్‌లో అవయవాలన్నీ సంపూర్ణంగా రూపుదిద్దుకోవచ్చుగానీ… అవి పరిపూర్ణంగా తమ విధులు నిర్వహించలేకపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘ఫంక్షనల్‌ ఇమ్యెచ్యురిటీ’ అంటారు. తల్లికి ప్రీమెచ్యూర్‌ ప్రసవం జరగబోతోందని ఊహించినప్పుడు… రాబోయే సమస్యలనూ కాస్త ముందుగానే ఊహించి, వెంటనే చికిత్స అందిస్తే ప్రీ–మెచ్యూర్‌ చిన్నారులు సైతం సాధారణ పిల్లల్లాగే బతికే అవకాశాలూ, మిగతా పిల్లల్లాగే మనుగడ సాగించే అవకాశాలు పెరుగుతాయి. కాకపోతే తల్లి కడుపులోనే ఉండే వాతావరణం…అంటే ‘ఇన్‌యుటెరో ఆట్మాస్ఫియర్‌’లో వారిని ఉంచి, తగిన చికిత్స ఇవ్వగలగాలి. అలా చేస్తే వారి పూర్తి మనుగడ (ఇంటాక్ట్‌ సర్వైవల్‌) సాధ్యమవుతుంది.

కంగారూ కేర్‌తో మరిన్ని మంచి ఫలితాలు…
ప్రీ–టర్మ్‌ బేబీస్‌ విషయంలో తీసుకోవాల్సిన ఓ మంచి సంరక్షణ విధానమే ‘కంగారూ కేర్‌’. ఆస్ట్రేలియన్‌ కంగారూలు తమ బిడ్డను తమ సంచిలో ఉంచి, సాకే విషయం తెలిసిందే. నిజానికి కంగారులకు పుట్టే పిల్లలన్నీ ప్రీ–టర్మ్‌ బిడ్డలే. అవి పూర్తిగా ఎదిగే వరకూ వాటి సంచిలో ఉంచి పెంచుతాయి. అలాగే ప్రీ–టర్మ్‌ బిడ్డల విషయంలోనూ కంగారూల్లాగే తల్లి మేనితో బిడ్డ మేను ఆనేలా ఉంచి, తగిన కేర్‌ను అందిస్తారు. మరీ ముఖ్యంగా బరువు తక్కువగా ఉండే బిడ్డల్లో ఈ తరహా కేర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ప్రీ–టర్మ్‌ డెలివరీ కాబోతోందని తెలిసినప్పుడు, అన్ని రకాల అధునాతన వైద్య సౌకర్యాలూ, నిపుణులైన డాక్టర్లు ఉన్న ‘రెయిన్‌ బో హాస్పిటల్‌’ వంటి ఆసుపత్రుల్లో ప్రసూతికి ఏర్పాట్లు చేసుకోవడం ఎంతైనా అవసరం.

Dr. BALA SRI LATHA PULI
Consultant Neonatologist & Pediatrician
MBBS, DNB(Pediatrics)
Rainbow Children’s Hospital
Visakhapatnam