Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!

Onion Pesarattu

Onion Pesarattu

Onion Pesarattu: రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం బలవర్ధకంగా ఉండాలి. పిండి పులియబెట్టే పని లేకుండా, తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రొటీన్ అందించే బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది పెసరట్టే. శరీరానికి శక్తినిచ్చే పెసర్లు, రుచిని పెంచే ఉల్లిపాయల కలయికతో తయారయ్యే ఈ హెల్దీ ఆనియన్ పెసరట్టు బరువు తగ్గాలనుకునే వారికి కూడా అద్భుతమైన ఎంపిక కూడాను.. దోశల్లో అన్నింటికంటే ఎంతో బలవర్ధకమైన, రుచికరమైన అల్పాహారం ‘ఆనియన్ పెసరట్టు’. వంట పెద్దగా రానివారు సైతం ఇంట్లోనే సులభంగా, సరైన కొలతలతో హోటల్ స్టైల్ క్రిస్పీ పెసరట్టును ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ వివరంగా చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

* పెసర్లు: 300 గ్రాములు
* బియ్యం: 100 గ్రాములు
* అల్లం: చిన్న ముక్కలు (4 నుండి 5)
* పచ్చిమిర్చి: 4 నుండి 5
* కరివేపాకు: ఒక పావు పిడికెడు (దాదాపు 10 ఆకులు)
* కొత్తిమీర: కొద్దిగా
* పసుపు: పావు టీస్పూన్ నుండి అర టీస్పూన్ వరకు
* ఉప్పు: ముప్పావు టీస్పూన్ (రుచికి సరిపడా)
* టాపింగ్ కోసం: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, సన్నని పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర
* నూనె: కాల్చడానికి సరిపడా

తయారీ విధానం

పిండి తయారీ

ముందుగా పెసర్లు, బియ్యాన్ని శుభ్రంగా మూడు నుంచి నాలుగు సార్లు కడిగి, సరిపడా నీళ్లు పోసి కనీసం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. సమయం ఉంటే రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే కూడా చేసుకోవచ్చు. బాగా నానిన పెసర్లు, బియ్యాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ముప్పావు టీస్పూన్ ఉప్పు వేయాలి. తగినన్ని నీళ్లు మాత్రమే పోస్తూ దోశ పిండి మాదిరిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని.. అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా అనిపిస్తే అవసరాన్ని బట్టి కొద్దిగా మైదా పిండిని కలుపుకోవచ్చు, ఇష్టం లేనివారు దీనిని పూర్తిగా దాటవేయవచ్చు. ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే పెసరట్లు వేసుకోవచ్చు.

పెసరట్టు వేసి కాల్చే పద్ధతి

స్టవ్ వెలిగించి పెనం బాగా వేడెక్కాక, ఒక గరిటెడు పిండిని తీసుకుని దోశలా పల్చగా పరుచుకోవాలి. దీనిపై ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర మిశ్రమాన్ని సమానంగా చల్లుకోవాలి. ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడేవారు ఉల్లిపాయ ముక్కలను మరికొంత ఎక్కువగా వేసుకోవచ్చు. దోశ అంచుల వెంబడి సరిపడా నూనె వేసి, మధ్యస్థ మంటపై మంచి రంగు వచ్చే వరకు ఎర్రగా కాల్చుకోవాలి. పెసరట్టు మాడిపోకుండా దోరగా రోస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా మడిచి పెనంపై నుంచి తీసి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి.

ఈ కరకరలాడే వేడి వేడి ఆనియన్ పెసరట్టును అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎంతో తేలిగ్గా చేసుకోగలిగే ఈ రెసిపీని బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా డిన్నర్‌గా ఎప్పుడైనా ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే దీనిని చేసి మీ ఇంట్లో వారితో తింటూ ఎంజాయ్ చేయండి.