ఒబేసిటీ (అతిగా బరువు పెరగడం) అనేది కేవలం శారీరక రూపాన్ని మాత్రమే కాకుండా, మన మొత్తం ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఒక ప్రధాన సమస్య. ఒబేసిటీ కారణంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, కొలెస్ట్రాల్ పెరగడం వంటి ప్రమాదకర అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, నిరంతర ఒత్తిడి వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సుమారు 38 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అంచనా.
ఊబకాయం వల్ల మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిద్రలో శ్వాస ఆగిపోవడం (స్లీప్ అప్నియా), కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. శారీరక సమస్యలతో పాటు ఆత్మవిశ్వాసం తగ్గడం, డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలకు కూడా ఒబేసిటీ ఒక ప్రధాన కారణంగా మారుతుందని చెబుతున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, 2035 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 51 శాతం మంది ఒబేసిటీ బారిన పడే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెల్త్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా, ఊబకాయంతో ఉన్న మహిళలకు జన్మించే పిల్లలు కూడా భవిష్యత్తులో స్ట్రోక్, డయాబెటిస్, ఆస్తమా, గుండె జబ్బులు వంటి అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, చురుకైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా ఒబేసిటీని నియంత్రించి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీకు ఏవైనా సందేహాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
