NTV Telugu Site icon

Mental Health Epidemic: షాకింగ్‌ సర్వే.. మనలో 40 శాతం మందికి ఈ సమస్యే..!

Depression

Depression

మనలో కొందరు, మన చుట్టూ ఉన్నవారిలో మరికొందరు.. మనకు తెలిసినవారు, బంధువులు, స్నేహితులు.. ఇలా అనేక మంది.. చాలా సమస్యలతో బాధపడుతున్నారు.. ఆరోగ్యసమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు.. ఇక, ఆర్థిక సమస్యలైతే చెప్పకరలేదు.. కొందరికి అన్నీ ఉన్నా.. ఏదో తెలియని మానసిక సమస్యలతో బాధపడుతుంటారు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ ఆరేళ్ల క్రితం దేశంలోని 12 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే అనేక ఆందోళనకరమైన అంశాలను వెలికితీసింది.. ఈ సర్వే ప్రకారం 2.7 శాతం ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. భారత దేశంలోని 15 కోట్ల మందికి మానసిక సమస్యల నుంచి ఉపశమనం కోసం వెంటనే వైద్యం అవసరమని తేల్చేసింది ఆ సర్వే.. సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో 2016లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే సేవలు పొందుతున్నారని పేర్కొంది. క్రమంగా ఈ సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉందని.. దీనికి బ్రేక్‌లు వేయకపోతే రానున్న పదేళ్ల తర్వాత ప్రపంచంలోనే మానసిక సమస్యల బారినపడినవారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.

Read Also: Aerobic dance: ఏరోబిక్ డ్యాన్స్ తో ఉపయోగాలేంటి? అనర్థాలేంటి?

అయితే, ఈ పరిణామాలపై నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నగరాలు విస్తరిస్తుండడం, ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం.. చాలామంది సొంతూళ్లు, నగరాలను వీడి సిటీలకి మారుతుండడం.. లాంటివి కూడా ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని, ఈ క్రమంలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు కుంగుబాటుకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, పాశ్చ్యాత్తీకరణ శరవేగంగా జరుగుతుండడంతో కొత్త సాంకేతికతల ఆవిర్భావం కూడా ఒత్తిళ్లకు కారణం కావొచ్చనే అంచనాలున్నాయి.. మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఇప్పుడు చాలామంది గుర్తించారని వైద్యులు అలర్ట్ చేస్తున్నారు.. దేశరాజధాని ఢిల్లీలోని స్టీఫెన్స్ ఆస్పత్రికి చెందిన సైకియాట్రిస్ట్ రూపాలీ శివాల్కర్.. ఈ అంశాలపై మాట్లాడుతూ.. మన చుట్టూ ఉన్నవారిలో 30 నుంచి 40 శాతం మంది సాధారణ మానసిక సమస్యలతో బాధపడుతుంటారు, కానీ, తాము మానసిక సమస్యతో బాధపడుతున్నామన్న విషయం గుర్తించలేరని పేర్కొన్నారు..

ఈ సమస్య ఉన్నవారిలో లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు.. మనిషికి, మనిషికీ లక్షలణాలు మారుతూనే ఉంటాయి.. పనిపైనా ఆసక్తి చూపించకపోవడం.. శారీరకంగా ఎలాంటి కష్టం లేకపోయినా అలసటగా అనిపించడం, నిత్యం మగతగా ఉండడం, ప్రతీ విషయానికి చిరాకు, చిన్న విషయానికే కోపం, కారణం లేకుండానే కోపాన్ని ప్రదర్శించడం, సందర్భంలేకుండానే ఏడుపు రావడం.. ఇలాంటివి కూడా లక్షణాలుగానే ఉన్నాయి.. ఇక, చిన్న పిల్లల్లో అయితే ఆకస్మికంగా ప్రవర్తన మారిపోవడం, స్కూల్‌కి వెళ్లేందుకు ఆసక్తిచూపకపోవడం, ఉన్నట్టుండి లేజీగా.. లేకపోతే యాక్టివ్‌గా మారిపోవడం లాంటి లక్షణాలు రెండు వారాలకు మించి కనిపిస్తే వారు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లే అంటున్నారు వైద్యనిపుణులు.. హార్మోన్ సమస్యలు, హైపర్ థైరాయిడిజమ్, డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. యూత్‌ డిప్రెషన్‌లోకి వెళ్లడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణంగా చెబుతున్నారు.. సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసే తమ ఫొటోలు, పోస్టులకు లైక్‌లు తక్కువగా రావడం, అసలు రాకపోవడం వంటి కారణాలు కూడా తమను ఎవరూ పట్టించుకోవడం లేదేఅనే ఆందోళనకు గురిచేస్తాయంటున్నారు..

మరోవైపు ఒకరు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ ప్రభావం ఎంతో మందిపై పడుతుంది అంటున్నారు వైద్యులు.. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రభావం ఏకంగా 135 మందిపై పడే అవకాశం ఉందట.. అంటే.. ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తి కుటుంబసభ్యులు, సమీప బంధువులు, సన్నిహితులు, మిత్రులు, సహోద్యోగులు… ఇలా అనేక మందిపై ఆ ప్రభావం పడుతోందట.. అయితే, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నవారిని గుర్తించి.. ఆ లోచన నుంచి ఆ క్షణంలో బయటపడేలా చేస్తే.. వారి ప్రాణాలను కాపాడినవారు అవుతారని చెబుతున్నారు.. అయితే, మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవాలన్న అవగాహన ప్రజల్లో పెరిగిందని.. కానీ, ఇది నగరాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు.. ఇక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకోవడానికి మానసిక ఆరోగ్య చట్టం-2017ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలోనూ అంటే 1987లో కూడా ఇలాంటి చట్టం ఒకటి తెచ్చారు. అయితే, కొత్త చట్టంలో మానసిక జబ్బులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వం కొన్ని హక్కులు కల్పించింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఆత్మహత్యను నేరాల జాబితా నుంచి తొలగించారు. ఈ చట్టం మంచిదే అయినప్పటికీ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లోని విధానాలను ఇందులో అనుసరించారని, నిజానికి భారత్‌లో పరిస్థితులు వేరంటున్నారు వైద్యులు..