Homemade Anti-Aging Cream: వయసు పెరిగే కొద్దీ చర్మంలో సహజంగా ఉండే కొలాజెన్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. దీంతో చర్మం వదులుగా మారడం, ముడతలు, ఫైన్ లైన్స్ వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే వీటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీములు చాలానే ఉంటాయి. అయితే అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో చెప్పలేని పరిస్థితి. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో సింపుల్‌గా చర్మానికి మాయిశ్చరైజింగ్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు.
అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, బియ్యం పిండి, కలబంద చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. వీటితో తయారు చేసుకునే ఈ హోంమేడ్ క్రీమ్ చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
కావాల్సిన పదార్థాలు:
* బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్
* అవిసె గింజలు – 2 టేబుల్ స్పూన్లు
* తాజా కలబంద గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు
* రోజ్ వాటర్ – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
* బాదం నూనె లేదా విటమిన్-E క్యాప్సూల్ – 1 క్యాప్సూల్
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో ఒక కప్పు నీటిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేయాలి. వీటిని తక్కువ మంటపై 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. నీరు చిక్కగా, జెల్‌లా మారిన తర్వాత వేడిగానే మలమల వస్త్రం లేదా స్ట్రైనర్‌తో వడకట్టి అవిసె గింజల జెల్‌ను తీసుకోవాలి. తర్వాత మరో పాత్రలో బియ్యం పిండి, రోజ్ వాటర్ కలిపి తక్కువ మంటపై 2 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం స్మూత్‌గా, క్రీమీ పేస్ట్‌లా మారే వరకు కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో తయారు చేసుకున్న అవిసె గింజల జెల్, బియ్యం పిండి పేస్ట్, తాజా కలబంద గుజ్జు, బాదం నూనె లేదా విటమిన్-E క్యాప్సూల్ లో ఉన్న దానిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్పూన్ లేదా విస్కర్‌తో బాగా గిలకొట్టాలి. సాఫ్ట్, సిల్కీ, క్రీమీ టెక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని శుభ్రంగా, పూర్తిగా పొడిగా ఉన్న గాజు డబ్బాలోకి తీసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచాలి. అయితే తాజా కలబంద వంటి పదార్థాలతో తయారు చేసే హోంమేడ్ క్రీమ్‌కు ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ చేయడం మంచిది కాదు. వాసన, రంగు లేదా టెక్చర్ మారితే వెంటనే పారేయాలి.
ఎలా ఉపయోగించాలి?
రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న క్రీమ్‌ను కొద్దిగా తీసుకుని ముఖం, మెడపై అప్లై చేయాలి. కింద నుంచి పైకి దిశలో 3 నిమిషాల పాటు చాలా సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవచ్చు. ఈ మిశ్రమంలోని పదార్థాలు చర్మానికి తేమను అందించి మృదుత్వాన్ని పెంచడంలో సహాయపడతాయి. అయితే ఇది నిజంగా చర్మంలోని కొలాజెన్‌ను పెంచుతుందని నిర్ధారించే బలమైన ఆధారాలు లేవు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు ముఖానికి అప్లై చేసే ముందు చేతి మణికట్టు లేదా చెవి వెనుక చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఏదైనా దురద, మంట లేదా ఎర్రదనం కనిపిస్తే ఉపయోగించకండి.

