Child Health Tips : సాధారణంగా కిడ్నీలో రాళ్లు అనేవి కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చే సమస్య అని మనం భావిస్తుంటాం. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై డాక్టర్ భగత్ వివరిస్తూ.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను ఆదిలోనే గుర్తించవచ్చని పేర్కొన్నారు.
పిల్లల్లో కిడ్నీ రాళ్లు రావడానికి ప్రధాన కారణాలు:
- డీహైడ్రేషన్ (నీరు తక్కువగా తాగడం): పిల్లల్లో కిడ్నీ రాళ్లు రావడానికి అత్యంత ప్రధాన కారణం శరీరానికి సరిపడా నీరు అందకపోవడం. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలు ఆడుకోవడంలో పడి నీరు తాగడం మర్చిపోతుంటారు. దీనివల్ల మూత్రం చిక్కబడి రాళ్లు ఏర్పడతాయి.
- ఆహారపు అలవాట్లు: చిప్స్, జంక్ ఫుడ్ వంటి ఉప్పు (సోడియం) అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తినిపించడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.
- సాఫ్ట్ డ్రింక్స్: కూల్ డ్రింక్స్ , సోడాలలో ఉండే ఫాస్ఫేట్లు రాళ్లు ఏర్పడటానికి దోహదపడతాయి.
- జన్యుపరమైన కారణాలు: కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ రాళ్ల సమస్య ఉంటే, పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!
తల్లిదండ్రులు గుర్తించాల్సిన లక్షణాలు:
- కడుపు నొప్పి: పిల్లలు తమకు కలిగే నొప్పిని సరిగ్గా వివరించలేకపోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు కింది లక్షణాలను గమనించాలి. పక్కటెముకల కింద లేదా పొత్తికడుపులో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం. ఈ నొప్పి ఒక్కోసారి గజ్జల వరకు పాకుతుంది.
- మూత్రవిసర్జనలో ఇబ్బంది: మూత్రం పోసేటప్పుడు మంట లేదా విపరీతమైన నొప్పి కలగడం.
- మూత్రంలో మార్పులు: మూత్రం ఎర్రగా (రక్తం పడటం) లేదా ముదురు రంగులో రావడం.
- వాంతులు: నొప్పితో పాటు వికారం, వాంతులు అవ్వడం.
- తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్: పిల్లలకు పదేపదే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTIs) వస్తుంటే అది కిడ్నీ రాళ్లకు సంకేతం కావచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- పిల్లలు రోజంతా తగినంత నీరు తాగుతున్నారో లేదో గమనించాలి. వారు స్కూలుకు తీసుకెళ్లే బాటిల్స్ ఖాళీ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయాలి.
- ఆహారంలో ఉప్పును తగ్గించి, పీచు పదార్థాలు , తాజా పండ్లను ఎక్కువగా చేర్చాలి.
- ఒకవేళ పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే పీడియాట్రిక్ యూరాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా యూరిన్ టెస్ట్ చేయించడం మంచిది.
Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!
