Fake ORS: హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలి 8 ఏళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలపై ఏళ్లుగా పోరాడింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి ఆరోగ్యం దెబ్బతీసే విధంగా లేబుల్స్ ఉన్నాయని వాటిని నిషేధించాలని ఆమె పట్టుబట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్యశాఖలకు లేఖలు రాస్తూ వచ్చిందామే. ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ వైద్యురాలి ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని కఠినమైన నిర్ణయాలను ప్రవేశపెట్టింది. అసలు ఏం జరిగింది..? ఆ వైద్యురాలు ఎవరు? అనే అంశాల గురించి తెలుసుకుందాం..
READ MORE: Chirag Paswan: అసలైన దీపావళి నవంబర్ 14నే.. చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని. ఆమె ప్రస్తుతం ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న బ్రాండ్లు అన్ని నిజమైన ఓఆర్ఎస్‌లు కావని ఆమె ఏళ్ల తరబడి చెబుతూ పోరాటం చేశారు. సాధారణంగా, అతిసారం (డయేరియా)తో బాధపడుతున్నప్పుడు శరీరంలో సోడియం, షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండేందుకు ‘ఓఆర్ఎస్’ తాగాలని వైద్యులు సూచిస్తారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం.. సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాషియం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ డైహైడ్రేట్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉన్న పానీయం అసలైన ఓఆర్ఎస్. ఇందులో గ్లూకోజ్ స్థాయి కీలకం. వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్ ద్రావణంలో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. కొన్ని నకిలీ ఓఆర్ఎస్‌లలో గ్లూకోజు స్థాయి వంద మిల్లీలీటర్ల ద్రావణంలో 8 నుంచి 12 గ్రాముల వరకు ఉంటుంది. చక్కెర స్థాయిలు సైతం అధికంగా ఉంటున్నాయి. తక్కువస్థాయిలో ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. దీంతో వాటి లేబుల్స్‌ని రద్దు చేయాలని ఆమె కోరింది. లేబుల్స్ కారణంగా నకిలీ ఓఆర్ఎస్ ఏదో.. అసలైన ఓఆర్ఎస్ ఏదో కనుక్కోవడంలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని తెలిపింది.
అయితే.. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్) పదాన్ని ఉపయోగించవద్దని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSI) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కూల్‌డ్రింక్స్ రూపంలో ఉన్న టెట్రాప్యాక్‌లపై ఓఆర్‌ఎస్, ఓఆర్‌ఎస్‌ఎల్ అనే పదాలను ముద్రించకూడదని హెచ్చరించింది. ఈ డ్రింక్స్‌లో షుగర్ ఎక్కువగా ఉండటంతో విరేచనాలు ఇంకా పెరుగుతాయి. చాలా కంపెనీలు విచ్చలవిడిగా ఈ పదాలను తమ టెట్రాప్యాక్‌లపై ముద్రించి విక్రయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ FSSI ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
