Homemade Oil : ఇటీవలి కాలంలో మార్కెట్లో పండ్లు, కూరగాయల నుంచి నిత్యం వంటల్లో వాడే నూనెల వరకు అన్నింటిలోనూ కల్తీ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా వంట నూనెల్లో జరిగే కల్తీ మన ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఈ కల్తీ నూనెలకు ప్రత్యామ్నాయంగా, ఎలాంటి ప్రత్యేక యంత్రాలు అవసరం లేకుండా, కేవలం ఇంట్లో ఉండే మిక్సీ సహాయంతోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ప్రముఖ చెఫ్ పంకజ్ భదోరియా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆ సులభమైన తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్టెప్ 1: వేరుశెనగలను వేయించడం
ముందుగా, మనకు కావలసినన్ని వేరుశెనగ పప్పులను తీసుకుని, స్టవ్ మీద తక్కువ మంటపై దోరగా వేయించాలి. పప్పుల తొక్కలు లేత బంగారు రంగులోకి మారి, వేళ్లతో నొక్కినప్పుడు సులభంగా ఒలిచేంత వరకు వీటిని వేయించుకోవాలి.
స్టెప్ 2: తొక్క తీయడం , గ్రైండింగ్
వేయించిన వేరుశెనగలను కాసేపు పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత వాటిని ఒక శుభ్రమైన కాటన్ గుడ్డ మధ్యలో ఉంచి, రెండు చేతులతో మెల్లగా రుద్దితే తొక్కలన్నీ సులభంగా ఊడిపోతాయి. ఇప్పుడు తొక్క తీసిన పప్పులను మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి. ఇక్కడే ఒక ముఖ్యమైన జాగ్రత్త పాటించాలి; మిక్సీని నిరంతరం తిప్పకుండా, కేవలం ‘పల్స్ మోడ్’ (Pulse Mode) లో 2 నుండి 3 సెకన్ల పాటు ఆన్ చేస్తూ, మళ్లీ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేయాలి. ఒకేసారి 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు మిక్సీ రన్ చేయకూడదు.
స్టెప్ 3: పేస్ట్‌గా మార్చడం
పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేయడం వల్ల వేరుశెనగలు మొదట పొడిగా మారి, ఆ తర్వాత మరింతగా రుబ్బినప్పుడు అందులోని నూనె శాతం విడుదలవుతూ మెత్తని పేస్ట్‌లా తయారవుతాయి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్యాన్ లేదా చదునైన ట్రేలోకి మార్చుకుని, చపాతీ పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి.
స్టెప్ 4: నూనెను వేరు చేయడం
ఇప్పుడు ఈ ముద్దకు కొద్దిగా గోరువెచ్చని నీటిని ఒకేసారి కాకుండా, ఒకసారికి ఒక టేబుల్ స్పూన్ చొప్పున కొద్దికొద్దిగా పోస్తూ కలుపుతుండాలి. ఇలా పిండిలాంటి మిశ్రమాన్ని కలుపుతున్న కొద్దీ, వేరుశెనగ ముద్ద నుండి స్వచ్ఛమైన నూనె విడివడి బయటకు రావడం మీరు స్పష్టంగా గమనించవచ్చు.
స్టెప్ 5: వడకట్టడం , నిల్వ చేయడం
ఆ విధంగా వేరైన నూనెను ఒక పాత్రలోకి వడకట్టి, ఒక గాజు సీసాలో పోసి 2-3 గంటల పాటు కదల్చకుండా అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నూనెలోని చిన్న చిన్న మలినాలను లేదా పప్పు అవశేషాలను పూర్తిగా తొలగించడానికి ఒక పలుచని మస్లిన్ (పట్టు) వస్త్రంతో మరోసారి వడకట్టుకోవాలి. అంతే.. ఎంతో సువాసనతో కూడిన స్వచ్ఛమైన హోమ్‌మేడ్ వేరుశెనగ నూనె సిద్ధం. దీనిని సూర్యరశ్మి పడకుండా, చల్లని , పొడి ప్రదేశంలో ఉంచితే 3 నెలల వరకు వాడుకోవచ్చు.
మిగిలిపోయిన పిండి ముద్దను పారేయకండి
నూనె తీసేసిన తర్వాత మిగిలిపోయే వేరుశెనగ పిండి ముద్దలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి దానిని పారేయకుండా వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, ఆ ముద్దలో తగినంత బెల్లం పొడిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చుడితే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డూలు తయారవుతాయి. ఒకవేళ వంటల్లో వాడకూడదనుకుంటే, దీనిని మొక్కలకు సహజ ఎరువుగా వేయవచ్చు. ఇది నేల సారవంతాన్ని అద్భుతంగా పెంచుతుంది.
పేదల బాదం.. వేరుశెనగ!
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేరుశెనగలను ‘పేదవాని బాదం పప్పు’ అని పిలుస్తారు. ఎందుకంటే ఖరీదైన బాదంపప్పులో ఉండే దాదాపు అన్ని రకాల పోషకాలు వేరుశెనగలోనూ లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వులు (Healthy Fats) తో పాటు ప్రోటీన్, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం , విటమిన్ బి1, బి2, బి6 పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, కల్తీ నూనెలను వీడి ఇంట్లోనే ఇలా స్వచ్ఛమైన నూనెను తయారు చేసుకుని వాడటం వల్ల కుటుంబ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
