NTV Telugu Site icon

గంగా నదిలో మృతదేహాలు… ఆ నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా ?

Does Covid-19 spread through water and dead bodies?

గంగా నదిలో తేలుతున్న కరోనా మృతదేహాలు ప్రజలను కలవర పెడుతున్నాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్‌లోని నది నుంచి 70కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. 100కు పైగా మృతదేహాలను నదిలో పారేసినట్లు స్థానిక నివేదికలు ద్వారా తెలుస్తోంది. దీంతో మృతదేహాల ద్వారా, నదుల ద్వారా కోవిడ్ -19 వ్యాప్తి చెందుతుందా ? అనే భయాందోళనలు మొదలయ్యాయి అందరిలో. కోవిడ్ -19 సోకిన మృతదేహం ద్వారా కరోనా సోకుతుందా ? లేదా ? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇదొక అపోహ మాత్రమేనని నిపుణులు కొట్టి పారేసినప్పటికీ కోవిడ్ -19 కేసులలో మృతదేహాల విషయంలో అధికారులు ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారు. భారతదేశంలోని ఆరోగ్య సంస్థలు కోవిడ్ -19తో మృతి చెందిన మృతదేహాల నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) జారీ చేసిన మార్గదర్శకాలు మృతదేహాలను నిర్వహించడంలో కరోనావైరస్ సంక్రమణకు అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మాస్క్, కళ్ళజోడు, శానిటైజర్, మృతదేహాన్ని ఉంచిన బ్యాగ్‌ను క్రిమిసంహారకాలతో క్లీన్ చేయడం, వ్యక్తిగత రక్షణ (పిపిఇ) కిట్ల వాడకాన్ని వారు సూచిస్తున్నారు.

అయితే యుఎస్‌లో ప్రోటోకాల్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) మృతదేహం నుండి కోవిడ్-19 సోకే ప్రమాదం లేదని నమ్ముతున్నారు. అయినప్పటికీ అక్కడ కుటుంబ సభ్యులు కరోనా మృతదేహాన్ని చూడాలంటే కనీసం ఒకరికొకరు 1 మీటర్ దూరంలో ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరూ అసలు బాడీని ముట్టుకోవద్దు.

ఆరోగ్య నిపుణులు చెప్పేదాని ప్రకారం కోవిడ్ -19 కి కారణమయ్యే కరోనావైరస్ అయిన SARS-CoV-2 దగ్గు, తుమ్ము, శ్వాస, ఒకరితో ఒకరు మాట్లాడే సమయంలో నోట్లోంచి లేదా ముక్కులో నుంచి వెలువడే బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. కొన్ని బిందువులు చాలా చిన్నవి. వాటిని ఏరోసోల్స్ అని పిలుస్తారు. అవి రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం గాలిలోకి వెళ్లగలవు. దీని అర్థం కరోనావైరస్ సోకిన వ్యక్తి ద్వారా నీటిలో కూడా కరోనా వైరస్ ఉంటుంది. కొన్ని అధ్యయనాలు కరోనా సోకిన వ్యక్తుల మల పదార్థంలో కరోనావైరస్ ఆధారాలను కనుగొన్నాయి. శరీర ద్రవాలద్వారా కరోనా వైరస్ ను వ్యాప్తి చెందుతుంది. అయితే నీరు, ఈత కొలను SARS-CoV-2 కు ప్రసార మార్గంగా ఉంటాయని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. “కోవిడ్ -19 వైరస్ ఈత కొట్టేటప్పుడు నీటి ద్వారా వ్యాపించదు. కానీ ఎవరైనా సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటే వైరస్ వ్యాపిస్తుంది” అని WHO చెబుతోంది,

కరోనా సోకిన మృతదేహాలను నదిలో వేస్తే కోవిడ్ -19 వ్యాపిస్తుందా ? ఇది జలచరాలపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా ? దీనివల్ల ఒక జాతి నుండి మరొక జాతికి కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందా ? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే కరోనా సోకిన మృతదేహాలను నదిలో వేయడం వల్ల గంగాలో కాలుష్య స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే మృతదేహాల్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఏదేమైనా గంగాలో ఇలా మృతదేహాలు తేలడం అనేది ఆందోళనకర విషయమే.

Show comments