Healthy Winter Breakfast: చలికాలం వచ్చిందంటే చాలు.. ఏదైనా.. ఏ పూటకు.. ఆ పూట వేడివేడిగా తినాలని చూస్తాం.. ఇక, ఉదయం అల్పాహారంగా వేడివేడిగా, ఆరోగ్యకరంగా ఉండే ఆహారం తీసుకోవాలని చాలామంది కోరుకుంటారు. ప్రతిరోజూ పోహా, పరాటాలు తినడం బోర్గా అనిపిస్తే సజ్జల వెజిటబుల్ ఉప్మా మంచి ప్రత్యామ్నాయం. సజ్జలు శరీరానికి వెచ్చదనాన్ని అందించే ధాన్యంగా భావిస్తారు. అందుకే వీటిని శీతాకాలంలో ఆహారంలో చేర్చుకోవడం మంచిది. తక్కువ సమయంలోనే సులభంగా తయారయ్యే ఈ ఉప్మాలో కాలానుగుణ కూరగాయలను కూడా కలిపి తీసుకోవచ్చు.
సజ్జలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
సజ్జలు ఒక ముతక ధాన్యం. వీటిలో పీచుపదార్థం, ప్రోటీన్, ఇనుము వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించే ఆహారంగా వీటిని చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. తాజా కూరగాయలు, ఆవాలు, కరివేపాకుతో తాలింపు పెట్టి తయారు చేస్తే సజ్జల ఉప్మా రుచిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి, మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మంచి ఆహార ఎంపికగా ఉపయోగపడుతుంది.
సజ్జల వెజిటబుల్ ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు
* సజ్జలు – 1 కప్పు (రాత్రంతా లేదా కనీసం 2 గంటల పాటు నానబెట్టాలి)
* సన్నగా తరిగిన కూరగాయలు – 1 కప్పు (క్యారెట్, బఠానీలు, బీన్స్, క్యాప్సికమ్)
* ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
* పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
* అల్లం – 1 టీస్పూన్ (తురిమినది)
* ఆవాలు – 1 టీస్పూన్
* కరివేపాకు – 8 నుంచి 10 ఆకులు
* పచ్చి వేరుశెనగలు – 2 టేబుల్ స్పూన్లు
* నూనె లేదా దేశీ నెయ్యి – 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
* నీరు – 2.5 నుంచి 3 కప్పులు
* నిమ్మరసం – 1 టీస్పూన్
* ఉప్పు – రుచికి సరిపడా
* కొత్తిమీర – కొద్దిగా (అలంకరణ కోసం)
సజ్జల ఉప్మా తయారీ విధానం
ముందుగా నానబెట్టిన సజ్జలను తీసుకుని ప్రెషర్ కుక్కర్లో వేయాలి. అందులో 2.5 కప్పుల నీరు, కొద్దిగా ఉప్పు కలిపి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అనంతరం కుక్కర్ చల్లారిన తర్వాత ఉడికిన సజ్జలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె లేదా దేశీ నెయ్యి వేడి చేయాలి. అందులో ఆవాలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, పచ్చి వేరుశెనగలు వేసి వేయించాలి. వేరుశెనగలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, తురిమిన అల్లం వేసి ఉల్లిపాయలు లేత గులాబీ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
ఆ తర్వాత క్యారెట్, బఠానీలు, బీన్స్, క్యాప్సికమ్ వంటి కూరగాయలను వేసి కలపాలి. కూరగాయలు కొద్దిగా మెత్తబడే వరకు మధ్యస్థ మంటపై 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలి. అనంతరం ముందుగా ఉడికించి పెట్టుకున్న సజ్జలను బాణలిలో వేసి బాగా కలపాలి. అవసరమైతే రుచికి తగినంత ఉప్పు జోడించాలి. అయితే సజ్జలను ఉడికించేటప్పుడే ఉప్పు కలిపిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు బాణలిపై మూత పెట్టి తక్కువ మంటపై మరో 2 నుంచి 3 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల తాలింపు, మసాలాల రుచులు సజ్జలకు బాగా పడతాయి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండాలి. సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. మొత్తంగా.. చలికాలపు ఉదయాల్లో రుచితో పాటు పోషకాలు అందించే ఈ సజ్జల వెజిటబుల్ ఉప్మాను అల్పాహారంగా తీసుకోవచ్చు. సాధారణ ఉప్మాకు భిన్నంగా, కూరగాయలతో కలిపి తయారుచేసే ఈ వంటకం కుటుంబ సభ్యులందరికీ నచ్చుతుంది.

