Easy Lunch Recipes: రోజూ మధ్యాహ్నం భోజనంలోకి అదే పప్పుచారు, టమాటా రసం, సాంబార్ తిని బోర్ కొట్టేసిందా? నాలుకకు కాస్త కొత్త రుచి, కమ్మటి అనుభూతి కావాలనిపిస్తోందా? అయితే ఇంట్లో మిగిలిన చిక్కటి మజ్జిగతో ఒక్కసారి ఈ ‘స్పెషల్ కఢీ’ ట్రై చేయండి. పెద్దగా హడావుడి లేకుండా, వంటింట్లో ఉండే సాధారణ దినుసులతోనే పదిహేను నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం టేస్ట్ చూస్తే.. పక్కన ఎన్ని కూరలున్నా సరే ఎవరూ ముట్టుకోరు, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇంతకీ ఈ స్పెషల్ మజ్జిగ కఢీని సింపుల్‌గా ఎలా రెడీ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
* చిక్కటి మజ్జిగ: 2 కప్పులు
* శనగపిండి: 2 పెద్ద చెంచాలు
* నెయ్యి: 2 పెద్ద చెంచాలు
* జీలకర్ర: 1 చిన్న చెంచా
* ఆవాలు: 1 చిన్న చెంచా
* మెంతులు: 1 చిన్న చెంచా
* పసుపు: 1 చిన్న చెంచా
* కారం పొడి: 1 చిన్న చెంచా
* పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర: కొద్దిగా
* ఉప్పు: రుచికి తగినంత
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మజ్జిగ, శనగపిండి వేసి విస్కర్ లేదా గరిటెతో ఉండలు ఏమీ లేకుండా నునుపుగా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయండి. వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఆ తాలింపు వేగాక మంటను తగ్గించి, ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగ మిశ్రమాన్ని అందులో పోయాలి. మజ్జిగ విరిగిపోకుండా, అడుగంటకుండా తొలి పొంగు వచ్చే వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి. పొంగు వచ్చిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి. శనగపిండి పచ్చివాసన పోయి ఆ మిశ్రమం కాస్త చిక్కబడ్డాక, రుచికి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర చల్లుకుని దించేయాలి.
రుచిని పెంచే చిన్న టిప్స్..
* మజ్జిగ పోశాక పొంగు వచ్చేదాకా కలపడం ఆపొద్దు, లేదంటే మజ్జిగ నీళ్లలా విరిగిపోతుంది.
* తాలింపులో మెంతులు వేయడం వల్ల వచ్చే సువాసనతో పాటు జీర్ణశక్తి కూడా బాగుంటుంది.
* మరీ చిక్కగా అనిపిస్తే మరిగేటప్పుడు కాసిన్ని నీళ్లు పోసుకోవచ్చు.
వేడివేడి అన్నం లేదా జీరా రైస్‌లో ఈ కమ్మటి మజ్జిగ కఢీ వేసుకుని తింటుంటే.. ఆ రుచే వేరుగా ఉంటుంది. కుదిరితే ఒకసారి ట్రై చేసి చూడండి.

