Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..

Blood Donation Camp

Blood Donation Camp

రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే అత్యంత గొప్ప కార్యం. ఒకే ఒక్క రక్తదానం ద్వారా సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు, ప్రమాదాలకు గురైన వారు, రక్తహీనతతో బాధపడే ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చు. అయితే.. రక్తదానంపై సమాజంలో ఉన్న కొన్ని అపోహల వల్ల చాలా మంది ముందుకు రావడం లేదు. గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ హెమటాలజీ విభాగం చీఫ్ డాక్టర్ రాహుల్ భార్గవ రక్తదానంపై ఉన్న ముఖ్యమైన అపోహలను తొలగించారు.

రక్తదానం వల్ల శరీరం బలహీనపడుతుందా..?
రక్తదానం పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. మనం దానం చేసిన రక్తాన్ని శరీరం చాలా తక్కువ సమయంలోనే సహజంగా తిరిగి ఉత్పత్తి చేసుకుంటుంది. తగినంత నీరు తాగి, జాగ్రత్తలు పాటిస్తే రక్తదానం చేసిన మరుసటి రోజే ఎవరైనా తమ సాధారణ పనులను చేసుకోవచ్చు.

×
×
Ad

అరుదైన బ్లడ్ గ్రూపులు మాత్రమే అవసరం..?
ఆసుపత్రులలో ప్రతిరోజూ అన్ని రకాల బ్లడ్ గ్రూపుల అవసరం ఉంటుంది. ప్రమాదాలు, ప్రసవాలు, సర్జరీల సమయంలో రక్తం నిరంతరం అవసరమవుతుంది. మీ రక్తం గ్రూపు ఏదైనా సరే, అది మరొకరి ప్రాణాన్ని నిలబెడుతుంది.

అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎప్పటికీ రక్తదానం చేయలేరు..?
ఏదైనా అనారోగ్యం లేదా మందులు వాడుతున్నంత మాత్రాన శాశ్వతంగా అనర్హులు కారు. గర్భధారణ, చిన్నపాటి ఇన్ఫెక్షన్లు, ఇటీవలి సర్జరీలు వంటి తాత్కాలిక సమస్యలు ఉన్నప్పుడు కొంతకాలం వేచి ఉండాలి. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత వైద్యుల సలహాతో మళ్లీ రక్తదానం చేయవచ్చు.

18 నుండి 65 సంవత్సరాల వయస్సు ఉండి, 45 నుండి 50 కిలోల బరువు, సరైన హిమోగ్లోబిన్ స్థాయిలు కలిగిన ఆరోగ్యవంతమైన వ్యక్తులందరూ రక్తదానానికి అర్హులు. రక్తదానానికి ముందే వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. రక్తదాన ప్రక్రియలో ఉపయోగించే సూదులు, ఇతర పరికరాలు పూర్తిగా స్టెరిలైజ్డ్ (Sterilized) చేసినవి.. అంతే కాకుండా ఒక్కసారి మాత్రమే వాడేవి అయి ఉంటాయి. కాబట్టి రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం లేదు. అపోహలను వీడి.. క్రమబద్ధంగా రక్తదానం చేయడం ద్వారా సమాజంలో ఆరోగ్యకరమైన మార్పును తీసుకురావచ్చని డాక్టర్ రాహుల్ భార్గవ పిలుపునిచ్చారు.