Ayurvedic Remedies To Get Relief From Dust Allergy: మారుతున్న కాలానికి అనుగుణంగా.. ఎన్నో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాయు కాలుష్యం వల్ల.. కొందరు పలు రకాల అలెర్జీల బారిన పడుతుంటారు. అందులో డస్ట్ అలెర్జీ అయితే చాలామందిని బాధిస్తుంది. శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి గొంతులో మంట వరకు.. తీవ్ర సమస్యలకు గురవుతుంటారు. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కాసేపు సంచరించినా సరే.. డస్ట్ అలెర్జీతో నానా ఇబ్బందులు పడుతుంటారు. ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, కళ్లు ఎర్రబడడం, గొంతు నొప్పి, గొంతులో మంట వంటివి బాధిస్తాయి. ఎన్ని రకాల మందులు వాడినా, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందలేక కొందరు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయితే.. కొన్ని సహజసిద్ధ మార్గాల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా?
1. పసుపు: ఇది సహజసిద్ధమైన యాంటీ బయోటిక్. ఇందులో దగ్గును తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. ఇన్‌ఫ్లమేషన్, కళ్లె వంటి సమస్యల్ని సైతం తగ్గించే గుణం ఈ పసుపులో ఉంటుంది. కాబట్టి.. రాత్రి నిద్రపోవడానికి ముందు గోరువెచ్చని పాలలో పసుపుని కలుపుకుని తాగితే, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. ఈ చిట్కాని ప్రతిరోజూ పాటిస్తే, నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చని వాళ్లు పేర్కొంటున్నారు.
2. తులసి: ఇందులో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. శ్వాస కోస సమస్యలకు ఇది ఒక మంచి ఔషధం. దగ్గు వచ్చినప్పుడు.. తులసి ఆకుల్ని ఎండబెట్టి, వాటిని పొడిగా చేసుకొని, అందులో తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచూ తాగాలి. అలాగే.. అప్పుడే కోసిన తులసి ఆకులను కొంచెం కొంచెంగా నమిలి, ఆ రసాన్ని మింగినా మంచి ప్రయోజనం ఉంటుంది. తులసి ఆకులను నీటిలో కాచి తాగినా కూడా, ఫలితం ఉంటుందని అంటున్నారు.
3. బ్లాక్ కుమిన్: తులసి తరహాలోనే ఇందులోనూ యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇందులో ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని తేలింది. ఈ బ్లాక్ కుమిన్ నూనెను.. ముక్కుపై, గొంతుపై రాసుకుంటే.. అలెర్జిటిక్ సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కాన్ని తరచూ పాటిస్తే.. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
4. యోగ: శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బలహీనపడినప్పుడే.. అలెర్జీ వంటి సమస్యలు శరీరాన్ని బాధిస్తాయి. అలాంటప్పుడు సమయానుసారంగా అనునిత్యం యోగా చేస్తే.. వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. ఫలితంగా.. రకరకాల అలెర్జీలపై పైచేయి సాధించొచ్చు. అర్ధ చంద్రాసన, పవన ముక్తాసన, వృక్షాసన, సేతు భద్రాసనాలు చేస్తే.. ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.