Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!

Vada

Vada

Oil Less Vada: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, సాయంత్రం స్నాక్స్‌గా లేదా రాత్రి డిన్నర్‌కైనా సరిపోయే ఒక అద్భుతమైన హెల్దీ రెసిపీ ‘అటుకుల వడలు’. మినప్పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా, అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో ఈ వడలను సిద్ధం చేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా ఆవిరిపై ఉడికించి హెల్దీగా తినాలనుకునే వారికైనా, క్రిస్పీగా డీప్ ఫ్రై ఇష్టపడే వారికైనా ఈ రెసిపీ చక్కగా నప్పుతుంది. వీటికి కాంబినేషన్‌గా అతి తక్కువ నూనెతో చేసుకునే స్పెషల్ టమాటా రోటి పచ్చడి మరింత రుచిని తెచ్చిపెడుతుంది.

కావలిసిన పదార్థాలు

వడల కోసం:

* అటుకులు – 1 కప్పు
* బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) – అర కప్పు
* పెరుగు – అర కప్పు
* ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
* పచ్చిమిరపకాయలు – 4 (చిన్న ముక్కలు)
* జీలకర్ర – 1 టీస్పూన్
* కరివేపాకు – కొద్దిగా
* కొత్తిమీర – కొద్దిగా
* ఉప్పు – రుచికి సరిపడా
* నీళ్లు – చేతిని తడుపుకోవడానికి
* నూనె – డీప్ ఫ్రైకి సరిపడా (ఆవిరిపై ఉడికించే పద్ధతికి నూనె అవసరం లేదు)

టమాటా చట్నీ కోసం:

* టమాటాలు – 1/2 కేజీ
* పచ్చిమిరపకాయలు – 15
* చింతపండు – నిమ్మకాయ సైజు అంత
* వెల్లుల్లి రెబ్బలు – 12
* ఉల్లిపాయ – 1 (పెద్ద సైజు)
* కరివేపాకు – 1 రెమ్మ
* నూనె – 2 టీస్పూన్లు
* ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఒక స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక రమ్మ కరివేపాకు, మధ్యకు కట్ చేసుకున్న 15 పచ్చిమిరపకాయలు వేసి రెండు నిమిషాలు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాండీలో మరో స్పూన్ నూనె వేసి అరకిలో టమాటా ముక్కలు వేయాలి. టమాటాల నుంచి నీరు బయటకు వచ్చే వరకు రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి వేడి మీద ఉండగానే బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. వేడికి చింతపండు త్వరగా మెత్తబడుతుంది.

ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన పచ్చిమిరపకాయలు, 12 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో దంచినట్లుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మగ్గించిన టమాటాలను కూడా వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా తిప్పుకోవాలి. చివరగా ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో ఒక్క రౌండ్ కచ్చాపచ్చాగా తిప్పి ఈ చట్నీలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి అచ్చం రోటి పచ్చడిలా ఉండి అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశ, వడల్లోకి అద్భుతంగా ఉంటుంది.

వడల పిండి తయారీ

ఒక బౌల్‌లో ఒక కప్పు అటుకులు (లావు లేదా సన్నని అటుకులు ఏవైనా పర్లేదు) తీసుకుని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. నీరంతా పూర్తిగా ఒంపేసి, కేవలం అటుకులను మాత్రమే మూతపెట్టి ఐదు నిమిషాలు పక్కన ఉంచితే అవి మెత్తగా నానుతాయి. నానిన అటుకులను మిక్సీ జార్‌లో వేసి, అందులో అర కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ), అర కప్పు పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా చేతికి అంటుకోని విధంగా కాస్త గట్టిగా ఉండాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

ఆవిరి వడలు

చేతికి కొద్దిగా నీటిని తడుపుకుంటూ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గుండ్రంగా వడల ఆకారంలో ఒత్తుకోవాలి. అంచులు చిట్లకుండా సమానంగా ప్రెస్ చేస్తూ రౌండ్‌గా గారెల్లా చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ప్లేట్లపై కొద్దిగా ఆయిల్ రాసి లేదా ఆకులు వేసి ఈ వడలను ఉంచాలి. మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌పై సుమారు 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. చేతితో తాకినప్పుడు పిండి అంటుకోకుండా ఉంటే వడలు చక్కగా ఉడికినట్లే. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకుంటే నూనె లేని ఆరోగ్యకరమైన, మెత్తటి వడలు సిద్ధమవుతాయి.

క్రిస్పీ డీప్ ఫ్రై వడలు

మరొక పద్ధతిలో క్రిస్పీగా కావాలనుకునే వారు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక సిద్ధం చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్‌పై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం మంటపై వేయించడం వల్ల లోపల పిండి చక్కగా ఉడికి, బయట ఎంతో క్రిస్పీగా తయారవుతాయి. నూనె లేకుండా ఆవిరిపై ఉడికించిన వడలు తియ్యని కమ్మదనంతో చాలా టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రై చేసిన వడల కంటే కూడా ఇవే ఎక్కువ రుచిగా అనిపిస్తాయి. ఈ వడలను కారంగా ఉండే టమాటా పచ్చడితో కలిపి తింటే ఆ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. పప్పులు నానబెట్టే తీరిక లేనప్పుడు క్షణాల్లో చేసుకునే ఈ వంటకం ఇంటిల్లిపాదికీ నచ్చుతుంది.