తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సెలవుల వివరాలను ఈ క్యాలెండర్‌లో స్పష్టంగా పొందుపరిచారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఇచ్చే సెలవులతో పాటు వేసవి సెలవుల వివరాలను ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది.
ఈ విద్యా సంవత్సరంలో అన్ని పండుగల కంటే అత్యంత పెద్దదైన దసరా పండుగకు విద్యార్థులకు అత్యధికంగా పదమూడు రోజుల పాటు సుదీర్ఘ సెలవులను ఖరారు చేశారు. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు ఈ దసరా సెలవులు పాఠశాలలకు వర్తిస్తాయి. ఆ తర్వాత వచ్చే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 13 నుంచి జనవరి 17వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు మిషనరీ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్రిస్మస్ సెలవులను కేటాయించారు. డిసెంబర్ 23 తేదీ నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ క్రిస్మస్ సెలవులు ఉంటాయి.
ఇక విద్యా సంవత్సరం ముగింపు విషయానికి వస్తే.. మొత్తం 227 పనిదినాల తర్వాత ఏప్రిల్ 23వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించారు. ఆ మరుసటి రోజు అనగా ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 13 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ వేసవి సెలవుల కాల వ్యవధిలో రెండో శనివారం మరియు ఆదివారం సెలవులు కూడా కలిసి వస్తాయి. తిరిగి జూన్ 14 తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి ఏప్రిల్ వరకు విద్యార్థులకు పండుగ సెలవులతో పాటు వివిధ రకాల పరీక్షల షెడ్యూళ్లను కూడా ప్రభుత్వం పక్కాగా రూపొందించింది. పండుగ సెలవుల కంటే ముందే విద్యార్థులకు మొదటి సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు పూర్తి చేయాలని, దసరా సెలవులు ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటించి రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ విధంగా విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, పండుగలను సంతోషంగా జరుపుకోవడానికి వీలుగా సెలవుల లీడ్‌తో కూడిన స్పష్టమైన ప్రణాళికను విద్యాశాఖ అమలు చేస్తోంది.

