Site icon NTV Telugu

Most Expensive Pillow: ప్రపంచంలోనే ఖరీదైన దిండు.. ధర తెలిస్తే అదిరిపోవాల్సిందే

Most Expensive Pillow

Most Expensive Pillow

సాధారణంగా దిండు ధర ఎంత ఉంటుంది.. మహా అయితే వందల్లో ఉంటుంది. మరీ అయితే కొన్ని వేలల్లోనే ఉంటుంది. పడుకునే టైమ్ లో తలకింద పెట్టుకునే దిండు ధర రూ. 45 లక్షలు ఉంటుందని ఎవరైనా కలలోనైనా ఊహించి ఉంటారా..? లేదు కదా. కానీ నెదర్లాండ్ లోని ఓ సంస్థ తయారు చేసిన దిండు ధర ఏకంగా 57,000 డాలర్లు, మన కరెన్సీలో రూ. 45 లక్షలు. అయితే మరీ అంతగా ఆ దిండులో ఏముందో తెలుసుకుందాం.

ఈ దిండును రూపొందించడానికి దాదాపుగా 15 ఏళ్లు పట్టింది. నెదర్లాండ్స్ కు చెందిన థిజ్స్ వాన్ డెర్ హిల్ట్స్ అనే సంస్థ ఈ పిల్లో తయారీ వెనక ఉంది. అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఈ ‘ టైలర్ మేడ్ పిల్లో’ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, ఆధునాతనమైనది చెబుతున్నారు. దీని తయారీ కోసం ఈజిప్షియన్ పత్తి, మల్బరీ సిల్క్ వాడారు. విషరహితమైన మెమోరీ ఫోమ్ తో నింపారు. దీంతో పాటు ఈ దిండులో 24 క్యారెట్ల బంగారం, వజ్రాలు, నీలమణి( సఫైర్) ఉన్నాయి. దిండును నింపడానికి వాడే పత్తి రోబోటిక్ మిల్లింగ్ యంత్రం నుంచి వస్తుంది.

పిల్లో 24 క్యారెట్ గోల్డ్ కవర్ ను కలిగి ఉంది. ఇది ఆరోగ్యకరమైన నిద్ర కోసం విద్యుత్ అయస్కాంత వికిరణాలను నిరోధిస్తుంది. ధర ట్యాగ్ జిప్పర్ 22.5 క్యారెట్ల సఫైర్, నాలుగు వజ్రాలను కలిగి ఉంది. హైటెక్ సొల్యూషన్స్, హస్తకళను కలిపి ఈ టైలర్ మేడ్ పిల్లోను తయారు చేశారు. నిద్ర లేమితో బాధపడుతున్న వ్యక్తులు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇది సహాయపడనుంది.

దీంతో పాటు వ్యక్తుల భుజాలు, మెడ, తల ఖచ్చితమైన కొలతల కోసం 3డీ టెక్నాలజీని ఉపయోగించి దిండును తయారు చేస్తారు. వ్యక్తుల తలకు అనుగుణంగా దిండును రూపొందిస్తారు. ఈ పిల్లోను తయారు చేసేందుకు ముందుగా కస్టమర్ల శరీర కొలతలు, నిద్ర పోయే విధానాన్ని గమనించి అందుకు అనుగుణంగా పిల్లోను రూపొందిస్తారు.

 

 

 

 

Exit mobile version