Site icon NTV Telugu

US: కాలిఫోర్నియాలో కూలిన ఎఫ్-16 జెట్ విమానం.. వీడియో వైరల్

Usf 16

Usf 16

అగ్ర రాజ్యం అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-16సీ ఫైటర్‌ జెట్‌ కూలిపోయింది. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నాడినో కౌంటీలోని ట్రోనా విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బుధవారం దక్షిణ కాలిఫోర్నియాలోని ట్రోనా విమానాశ్రయం సమీపంలో అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోయిందని సైన్యం ధృవీకరించింది. పైలట్ పారాచ్యూట్‌ సాయంతో సురక్షితంగా బయటపడ్డాడని.. అతని పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించింది.

ఈ విమానం నెవాడాలోని నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఉన్న ఎయిర్ ఫోర్స్ థండర్‌బర్డ్స్‌కు కేటాయించబడిన F-16C ఫైటింగ్ ఫాల్కన్ అని యూఎస్ ఎయిర్ ఫోర్స్ సార్జెంట్ జోవాంటే జాన్సన్ తెలిపారు. శిక్షణా మిషన్‌లో భాగంగా బుధవారం స్థానిక సమయం ప్రకారం ఉదయం 10:45 గంటలకు జెట్ కూలిపోయింది. ప్రమాదానికి గల కారణం దర్యాప్తులో ఉందని ప్రకటనలో తెలిపారు.

జెట్ విమానం కూలిపోతున్న సమయంలో కారులో వెళ్తున్న 60 ఏళ్ల డారెన్ స్ప్రింగర్ అనే వ్యక్తి మొబైల్‌లో షూట్ చేశాడు. పొగలు కమ్ముకుంటూ ఎడారిలో కూలిపోయిందని.. గుండె ఆగినట్లు అయిందంటూ డారెన్ పేర్కొన్నాడు. ఇక ప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఆ ప్రాంతంలో నాలుగు థండర్‌బర్డ్‌లు ఎగిరినట్లు చూసినట్లు తెలిపాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Exit mobile version