US – Iran Conflict: ఇరాన్ – అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచం అంతా తీవ్ర చమురు సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. ఒకవైపు వాషింగ్టన్ – టెహ్రాన్ మధ్య అణు ఒప్పందం ముందుకు సాగడంలో విఫలమవుతుండగా, మరోవైపు హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ సుముఖంగా లేదు. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధి గుండా ఇతర దేశాల నౌకలు వెళ్లాలంటే సుంకం చెల్లించాల్సిందేనని ఇరాన్ స్పష్టంగా చెబుతోంది. ఇరాన్ మొండి వైఖరి కారణంగా అమెరికా ఆందోళనలను పెంచింది. ఈ కష్టకాలంలో అగ్రరాజ్యానికి బాసటగా నిలిచేందుకు ఉక్రెయిన్ ముందుకు వచ్చింది. ఇరాన్ నియంత్రణ నుంచి హోర్ముజ్ జలసంధిని విడిపించడానికి అమెరికాకు తక్కువ ధర గల డ్రోన్‌లు, రోబోట్‌లను అందిస్తామని ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది.
అమెరికాకు ఉక్రెయిన్‌కు సహాయం ఎందుకు ముఖ్యం అంటే..
సీబీఎస్ న్యూస్ ప్రకారం.. తాజాగా ఉక్రెయిన్ పెంటగాన్ అధికారులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఉపయోగపడే చవకైన, దేశీయంగా తయారు చేసిన డ్రోన్‌లను ఉక్రెయిన్ వాషింగ్టన్‌కు పంపుతుంది. కొద్ది రోజుల క్రితమే అమెరికాకు రోబోట్‌లను సరఫరా చేసే ప్రణాళికలను కూడా ఉక్రెయిన్ ప్రకటించింది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, రష్యా నల్ల సముద్రంలోని హోర్ముజ్ జలసంధిని పోలిన దిగ్బంధనాన్ని విధించింది. అయితే ఆ టైంలో ఉక్రెయిన్ తక్కువ ఖర్చుతో తయారు చేసిన డ్రోన్‌లను యూజ్ చేసి ఆ జలసంధిని తెరవగలిగింది. ఇప్పుడు ఉక్రెయిన్ నౌకలు నల్ల సముద్రంలో ఈజీగా ప్రయాణిస్తున్నాయి, ఇదే సమయంలో రష్యా నౌకలు మాత్రం అంత సులభంగా ప్రయాణించడం లేదు.
నిజానికి ఉక్రెయిన్ అమెరికాకు ఇవ్వడానికి సిద్ధపడిన ఈ డ్రోన్లు చాలా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసేవి. వాటిని హోర్ముజ్ సమీపంలో మోహరించడం ద్వారా, అమెరికా పెద్ద మొత్తంలో ఖర్చులను ఆదా చేసుకోగలదు. ఇటీవల జరిగిన యుద్ధంలో ఇరాన్ డ్రోన్లను ఉపయోగించి అమెరికాకు తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉక్రేనియన్ డ్రోన్లను ఉపయోగించి, అమెరికా టెహ్రాన్‌పై ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధపడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్‌లను గతంలో ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కో – కీవ్‌కు వ్యతిరేకంగా ఈ డ్రోన్‌లను ఉపయోగిస్తుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైనికులు యుద్ధంలో షాహెద్ డ్రోన్‌లను ఎలా ఓడించాలో తెలుసుకున్నారు. దీంతో ఇప్పుడు అమెరికా – ఇరాన్ యుద్ధంలో ఈ షాహెద్ డ్రోన్‌ల దాడుల నుంచి అగ్రరాజ్యాన్ని కాపడటానికి ఉక్రెయిన్ సహాయం చాలా కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభిప్రాయం ప్రకారం.. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి భూతల దళాలు అవసరం. అయితే ఈ నిర్ణయం చాలా ప్రమాదకరమైనది. దీంతో ఉక్రెయిన్ ఇప్పుడు అమెరికాకు తక్కువ ధరలో తయారు చేసిన రోబోలను అందించడానికి ముందుకొచ్చింది. వీటిని ఉపయోగించి అమెరికా ఇరాన్‌పై భూతల దాడులను సులభంగా నిర్వహించగలదు.
ఇరాన్‌కు అతిపెద్ద బలంగా హోర్ముజ్ జలసంధి..
నిజానికి హోర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌కు ప్రవేశ ద్వారం. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలలో సుమారు 25 శాతం ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. అందుకే ఇది ఇరాన్‌కు అత్యంత కీలకంగా మారింది. యుద్ధ సమయంలో ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించి, అమెరికాను వెనకడుగు వేసేలా చేసింది. ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. అణు ఒప్పందం సమయంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధికి సంబంధించి ఒక ప్రతిపాదన చేసింది. హోర్ముజ్ జలసంధిని నియంత్రించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ కోరుకుంటుండగా, అమెరికా దానిని వ్యతిరేకిస్తోంది.
