భారత్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి, గల్ఫ్‌లో అత్యంత కీలకమైన యూఏఈ గోధుమల ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకొన్న గోధుమలను మరో దేశానికి ఎగుమతి చేయడంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగు నెలలపాటు నిషేధం విధించింది. అయితే, మే 14న భారత్ గోధుమ ఎగుమతులను నిషేధించడంతో యూఏఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు, దేశీయ వినియోగం కోసం యూఏఈకి గోధుమలను ఎగుమతి చేయడానికి భారత్ ఆమోదించిందని పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే గోధుమలను ఎక్కువగా పండించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశీయ వినియోగం కోసమే భారత్ గోధుమల ఎగుమతికి అంగీకరించిందని యూఏఈ వెల్లడించింది.
ఇక, తమకు గోధుమలను సరఫరా చేయాలని ఇండోనేసియా, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్, యెమన్ దేశాలు భారత్‌ను కోరాయి. దీంతో, యూఏఈ ప్రజల అవసరాలకు సరిపడా గోధుమలను పంపేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. భారత్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసిన నేపథ్యంలో.. తమ దేశం మీదుగా భారత గోధుమలు విదేశాలకు ఎగుమతి కాకుండా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్ మే 14వ తేదీన గోధుమల ఎగుమతులను నిషేధించిన విషయం తెలిసిందే. ఆయా దేశాలు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తేగానీ, లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్లు ఉన్న దేశాలకు మాత్రమే గోధుమల ఎగుమతికి అనుమతిస్తోంది. నాటి నుంచి భారత్ 4,69,202 టన్నులు ఎగుమతి చేసింది. మే 13వ తేదీకి ముందే భారత్ నుంచి దిగుమతి చేసుకొన్న గోధుమల ఎగుమతులకు సంబంధించి అనుమతుల కోసం తొలుత ఆర్థిక మంత్రిత్వ శాఖలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. భారత్-యూఏఈ ఫిబ్రవరిలో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల వాణిజ్యం 100 బిలియన్ డాలర్లను తాకాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకొంది.
