Site icon NTV Telugu

Heroines Arrest: ఇద్దరు హీరోయిన్లు అరెస్ట్.. కెమెరా ముందు ఆ పని చేసినందుకే!

Iran Actresses Arrested

Iran Actresses Arrested

Two Heroines Arrested In Iran: ఇరాన్‌లో హిజాబ్‌‌కు వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశ మహిమలు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఆంక్షలు, సైన్యం అణచివేతతో పాటు దుండగులు కాల్పులకు తెగబడుతున్నా.. నిరసనకారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. హిజాబ్ తొలగిస్తూ, జుట్టు కత్తిరిస్తూ.. దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. వీరికి మద్దతుగా ఇద్దరు హీరోయిన్లు కూడా రంగంలోకి దిగారు. దీంతో.. ఇరాన్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది.

ఆ హీరోయిన్ల పేర్లు.. హెంగమెహ్ ఘజియానీ, కటయోన్ రియాహి. ఆ ఇద్దరిలో ఘజియానీ అనే నటి ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంలో యాంటీ-హిజాబ్‌కి మద్దతుగా ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె హిజాబ్ లేకుండా మౌనంగా నిల్చోవడాన్ని గమనించవచ్చు. ఆ వెంటనే వెనక్కి తిరిగి.. తన జుట్టుని ముడి వేసుకుంది. ఈ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేయడమే ఆలస్యం, క్షణాల్లోనే అది వైరల్ అయ్యింది. ఈ వీడియో పోస్ట్ చేయడంతో పాటు ఘజియానీ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. బహుశా ఇదే తన చివరి పోస్ట్ కావొచ్చని, ఈ క్షణం నుంచి తనకు ఏమైనా జరగొచ్చని పేర్కొంది. ఏం జరిగినా సరే.. చివరి శ్వాస వరకు తాను ఇరాన్ ప్రజలతోనే ఉంటానని పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదులతో పాటు పోలీసులు సైతం కాల్పుల పేరుతో నిరసనకారుల్ని చంపుతున్నారు కాబట్టి, తనని అలా చంపొచ్చన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఘజియానీ చేసిన ఈ పోస్టుని గమనించిన ఇరాన్ ప్రభుత్వం.. వెంటనే ఆమెను అరెస్ట్ చేసింది. మరో నటి కటయోన్ రియాహి కూడా.. ఘజియానీ తరహాలోనే హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలపడంతో.. ఆమెను సైతం అదుపులోకి తీసుకున్నట్టు ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. వాళ్లిద్దరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చింది. దీంతో.. ఆ ఇద్దరు హీరోయిన్ల అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. వీరి అరెస్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.

Exit mobile version