Tiffany Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారతదేశంలో పర్యటిస్తున్నారు. తన భర్త మైఖేల్ బౌలోస్‌తో కలిసి శుక్రవారం ఢిల్లీ చేరుకున్న ఆమె.. శని, ఆదివారాల్లో భారత్‌లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే టిఫనీ ట్రంప్ దంపతులు ప్రసిద్ధ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టత, అద్భుత వాస్తుశిల్పం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని వారు నిశితంగా పరిశీలించారు. ఈ పర్యటనపై టిఫనీ స్పందిస్తూ.. “భారత పర్యటన ఎంతో అద్భుతంగా, చిరస్మరణీయంగా సాగుతోంది” అని ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చారు.
తాజ్ మహల్ అందాలకు ఫిదా..
ఆదివారం ఉదయం టిఫనీ ట్రంప్ తన భర్తతో కలిసి ఆగ్రాలోని ప్రపంచ వింత ‘తాజ్ మహల్’ను సందర్శించారు. అక్కడ సుమారు గంటన్నర పాటు గడిపిన ఈ జంట.. తాజ్ మహల్ చారిత్రక నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆమె జైసల్మేర్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
ఎనిమిదేళ్ల తర్వాత రెండోసారి..
టిఫనీ ట్రంప్ భారత్‌కు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2018లో తన తండ్రి డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఆమె మొదటిసారి భారత్‌కు వచ్చారు. అప్పట్లోనూ ఆమె ఢిల్లీ, ఆగ్రాలను సందర్శించారు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ఇప్పుడు భారత్‌లో అడుగుపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ కూడా 2020 ఫిబ్రవరిలో అధికారిక పర్యటన నిమిత్తం తన భార్య మెలానియాతో కలిసి భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో తాజ్ మహల్‌ను సందర్శించిన ట్రంప్.. దానిని “శాశ్వతమైన ప్రేమకు నిలువెత్తు చిహ్నం”గా అభివర్ణించారు. తాజాగా భారత్‌లో పర్యటిస్తున్న టిఫనీ ట్రంప్ కేవలం అధ్యక్షుడి కుమార్తెగానే కాకుండా, తన గ్లామరస్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఆమె ఫోటోలు నెట్టింట తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆమె భారత పర్యటనకు సంబంధించిన ఫోటోలు కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ – ఆయన మాజీ భార్య మార్లా మాపుల్స్ కుమార్తె అయిన టిఫనీ.. ట్రంప్ సంతానంలో నాల్గవ వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్, బారన్ ట్రంప్ ఆమెకు తోబుట్టువులు. టిఫనీ 2020లో ప్రతిష్టాత్మక జార్జ్‌టౌన్ యూనివర్శిటీ లా సెంటర్ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. 2022 నవంబర్ 12న, అమెరికన్ – లెబనీస్ ప్రముఖ వ్యాపారవేత్త మైఖేల్ బౌలోస్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.
