Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!

Thailand Fire Accident

Thailand Fire Accident

Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మోటార్‌సైకిల్ అద్దె దుకాణంతో పాటు పైన ఉన్న నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది స్వల్పంగా గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే భవనంలోని పలు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో భారీ ప్రాణనష్టం జరిగింది.

స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన భవనం కింది అంతస్తులో మోటార్‌సైకిల్ అద్దె దుకాణం ఉండగా, పై అంతస్తులను నివాస ప్రాంతాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అవి వేగంగా ఇతర అంతస్తులకు వ్యాపించాయి. మంటలు, దట్టమైన పొగ కారణంగా భవనంలో ఉన్నవారు బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల వైపు వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో 17 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఫుకెట్ పోలీస్ కమాండర్ సురాచాయ్ సూక్సాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక దర్యాప్తులో భవనం సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ట్రాన్స్‌ఫార్మర్ పేలుడే మంటలకు ప్రత్యక్ష కారణమని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఫుకెట్ గవర్నర్ చోడ్నారిన్ కోడ్సోమ్ తెలిపిన వివరాల ప్రకారం.. భవనం కింది అంతస్తులోని మోటార్‌సైకిల్ అద్దె దుకాణంలో సుమారు 100 బైక్‌లు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ గ్యాస్, ఇంజిన్ ఆయిల్, ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు వంటి మండే స్వభావం కలిగిన పదార్థాలను నిల్వ ఉంచారు. ఈ పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వాటి నుంచి వెలువడిన దట్టమైన విషపూరిత పొగ భవనం అంతటా వ్యాపించడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారినట్లు ప్రాథమిక అంచనా.

అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కొందరు పై అంతస్తుల వైపు వెళ్లినట్లు గవర్నర్ తెలిపారు. సహాయక చర్యల సమయంలో మూడో అంతస్తులో ఒక మృతదేహాన్ని గుర్తించగా, ఐదో అంతస్తులో మరో 10 మృతదేహాలను గుర్తించారు. మంటలు, పొగ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితులు పై అంతస్తులకు చేరుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే వారు మరణించిన పరిస్థితులపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. మృతుల గుర్తింపు, ప్రమాదానికి సంబంధించిన ఇతర వివరాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఫుకెట్ థాయ్‌లాండ్ దక్షిణ ప్రాంతంలోని ప్రముఖ ద్వీపం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా దీనికి గుర్తింపు ఉంది. ఇలాంటి ప్రాంతంలో కమర్షియల్ షాప్స్, నివాసాలు ఒకే భవనంలో ఉండటం, అక్కడ భారీగా మండే పదార్థాలు నిల్వ ఉండటం అగ్నిప్రమాద తీవ్రతపై ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు, భవనంలోని మండే పదార్థాల పాత్రపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.