Houthi Rebels: యెమెన్‌లోని హౌతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న గ్రీక్ దేశానికి చెందిన అంతర్జాతీయ సరకు రవాణా నౌక ఎటర్నిల్ సీపై హౌతీ తిరుగుబాటుదారులు గ్రనేడ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో నౌకకు కిందవైపు భారీ రంధ్రం పడటంతో సముద్రంలో మునిగింది. విషయం తెల్సుకున్న యురోపియన్ యూనియన్ నేవీ బలగాలు క్షణాల్లో అక్కడికి చేరుకుని 10 మంది నౌక సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకు వస్తుండగా.. ఆలోపే మరి కొంత మంది సిబ్బందిని కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తరలించారు హౌతీలు.
Read Also: Shubhanshu shukla: భూమి మీదకు శుభాన్షు శుక్లా తిరిగి రావడం వాయిదా.. ఆరోజే వచ్చేది..!
అయితే, లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక మునిగిన ఘటనలో నలుగురు సజీవసమాధి అయ్యారు. కాగా, ఎర్ర సముద్రంలో వారం వ్యవధిలో హౌతీ రెబల్స్ ఇలా వాణిజ్యనౌకలపై దాడి చేయడం ఇది సెకండ్ టైమ్. హమాస్‌ను అంతం చేసేందుకు సాహసించిన ఇజ్రాయెల్‌పై కక్షతో హౌతీలు ఇలా పశ్చిమదేశాలకు చెందిన నౌకలపై దాడులకు దిగుతున్నారు. ఈ సందర్భంగా ఎటర్నిల్ సీ నౌక ఇజ్రాయెల్‌లోని ఎలాట్ ఓడరేవు వైపుకు వెళ్తుండగా ఇలా దాడికి పాల్పడ్డారు. పాలస్తీనియన్లకు సపోర్టుగా మేం దాడులను కొనసాగిస్తామని.. గాజా ఆక్రమణను ఇజ్రాయెల్ ఆపాల్సిందేనని హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు.
