NTV Telugu Site icon

Svante Paabo: వైద్యశాస్త్రంలో పాబోకు ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం

Svante Paabo Nobel Prize

Svante Paabo Nobel Prize

Svante Paabo Wins 2022 Nobel Prize in Medicine: వైద్యశాస్త్రంలో అందించిన విశేష సేవలకు గాను స్వాంటె పాబోకు ప్రపంచంలనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం (2022) దక్కింది. మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ.. స్వాంటె పాబోను ఈ బహుమతి వరించింది. ఈ పురస్కారాన్ని స్వీడన్ స్టాక్‌హోంలోని కారోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్‌ బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా.. తన మార్గదర్శక పరిశోధన ద్వారా పాబో అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి చూపించారని ఆ బృందం కొనియాడింది.

ఈ రోజు నుంచి వైద్య విభాగంతో ప్రారంభమైన నోబెల్ పురస్కారాల ప్రధానం.. వారం రోజుల పాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. ఆ తర్వాత శుక్రవారం రోజున 2022 నోబెల్‌ శాంతి పురస్కారం, అక్టోబర్‌ 10న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. కాగా.. నోబెల్‌ పురస్కారాలు అందుకున్న వారికి 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న గ్రహీతలకు అందజేస్తారు. గతేడాది ఈ నోబెల్ పురస్కారాన్ని ఉష్ణ గ్రాహకాలు, శరీర స్పర్శపై పరిశోధనలు చేసిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లు సంయుక్తంగా అందుకున్నారు.

ఇదిలావుండగా.. స్వీడెన్‌కు చెందిన స్వాంటె పాబో 1955 ఏప్రిల్ 20వ తేదీన జన్మించారు. ఉప్సాలా యూనివర్సిటీలో 1986లో తన పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈయన తండ్రి సునే బర్గ్‌స్ట్రామ్ కూడా ఫిజియోలజీలో 1982లో నోబెల్ పురస్కారాన్ని సామ్యుఎల్సన్, జాన్ ఆర్. వేన్‌తో కలిసి పంచుకున్నారు. కాగా.. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ‘నోబెల్’ పురస్కారాన్ని ప్రదానం చేస్తోన్న విషయం విదితమే! 1896లో ఆల్‌ఫ్రెడ్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతిఏటా అందిస్తున్నారు.