El Nino: ప్రపంచాన్ని ‘‘ఎల్ నినో’’ వణికిస్తోంది. ప్రపంచ వాతావరణంపై ఎల్ నినో తన పంజా విసిరేందుకు సిద్ధమైందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఏర్పడిన ఎల్ నినో 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన వాతావరణ దృగ్విషయంగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ ‘‘ప్రపంచ వాతావరణ సంస్థ (WMO)’’ హెచ్చరించింది. ఎల్ నినో ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశ ఉంది. పసిఫిక్ మహాసముద్రంలోని భారీ ఉష్ణశక్తి వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
WMO అంచనా ప్రకారం అక్టోబర్ -నవంబర్-డిసెంబర్ కాలంలో ఎల్ నినోకు కేంద్రంగా ఉన్న మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా సుమారు 3.7 డిగ్రీల వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.
వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మాయే ప్రపంచ ఉష్ణోగ్రతలకు సంబంధించిన ప్రపంచ మ్యాప్‌ను సోషల్ మీడివయాలో షేర్ చేశారు. ‘‘భూమి దాదాపు మొత్తం ఎర్రగా ఉంది’’ అని కామెంట్ చేశారు. ఎల్ నినో చలికాలం వరకు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని, అమెరికా మినహా అనేక ప్రాంతాల్లో భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో వాతావరణ నిపుణుడు లియోన్ సైమన్స్ పసిఫిక్ ప్రాంతంలో 3.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలను ‘‘సూపర్ డూపర్ ఎల్ నినో’’గా అభివర్ణించారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ‘‘ఎల్ నినో’’గా వ్యవహరిస్తారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా వర్షాల్లో అసమానతలు చోటుచేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడితే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు ముప్పు పెరుగొచ్చు. ఈ ఎల్ నినో 2024 ఫిబ్రవరి వరకు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు.

