Pete Hegseth: రక్షణ మంత్రినే మందలించిన సైనికుడికి అరుదైన గౌరవం.. స్వయంగా మెడల్ అందజేత!

Us Defence Secretary

Us Defence Secretary

Pete Hegseth: అమెరికాలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. దేశ రక్షణ మంత్రికే క్రమశిక్షణ గురించి గుర్తుచేసిన ఓ సాధారణ సైనికుడికి ఇప్పుడు ఉన్నత స్థాయి సైనిక పురస్కారం లభించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ (Pete Hegseth) స్వయంగా ఆ సైనికుడికి మెడల్ అందజేసి అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తనకు క్రమశిక్షణ గుర్తుచేసిన సైనికుడు థామస్ ఇగ్లేసియాస్ (Thomas Iglesias)కు ప్రత్యేక పురస్కారం అందజేశారు. పెంటగాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 11, 2026న అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలోని టూంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్ వద్ద ఆయన ప్రదర్శించిన క్రమశిక్షణ, విధి నిర్వహణకు గుర్తింపుగా జాయింట్ సర్వీస్ కమండేషన్ మెడల్ (Joint Service Commendation Medal) ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హెగ్‌సెత్ స్వయంగా సైనికుడి యూనిఫామ్‌కు మెడల్ అమర్చి, అతనితో కరచాలనం చేశారు. అనంతరం సైనికులంటే తమకు ఎంతో గౌరవమని, క్రమశిక్షణ ప్రమాణాలను కాపాడటం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను గురువారం సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అసలు సైనికుడు రక్షణ మంత్రినే ఎందుకు మందలించాడు?

నవంబర్ 11న అమెరికాలో వెటరన్స్ డే (Veterans Day) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ తన భార్య జెన్నిఫర్‌తో పాటు పలువురు సహచరులతో కలిసి అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలోని టూంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్ వద్దకు వెళ్లారు. అక్కడ స్మారక చిహ్నం ముందు ఫొటోలు దిగారు. ఆ సమయంలో ఆయనతో పాటు చీఫ్ ఆఫ్ స్టాఫ్ రికీ బురియా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పాట్రిక్ వీవర్, సీనియర్ అడ్వైజర్ టామీ రాడాబా ఉన్నారు.

ఫొటోలు దిగిన అనంతరం అక్కడ గట్టిగా నవ్వులు వినిపించడంతో సమాధి వద్ద విధులు నిర్వహిస్తున్న సైనికుడు థామస్ ఇగ్లేసియాస్ వారిని అప్రమత్తం చేశారు. ఆ ప్రదేశం అత్యంత గౌరవప్రదమైనదని, అక్కడి ప్రశాంతత, గంభీరతను కాపాడాలని గుర్తుచేశారు. రక్షణ మంత్రి సహా ఆయన బృందం కూడా ఈ సూచనను పాటించాల్సి వచ్చింది.

అమెరికాలో అత్యంత గౌరవనీయమైన స్మారక చిహ్నం

అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలో ఉన్న టూంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్ అమెరికాలో అత్యంత గౌరవనీయమైన యుద్ధ స్మారక చిహ్నాల్లో ఒకటి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, కొరియా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, గుర్తింపు తెలియని సైనికుల అవశేషాలను ఇక్కడ భద్రపరిచారు. 1948 నుంచి ఈ స్మారక చిహ్నానికి నిరంతర భద్రత కల్పిస్తున్నారు. అమెరికా సైన్యంలోని థర్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన ‘ది ఓల్డ్ గార్డ్’ సైనికులు ఇక్కడ నిరంతరం కాపలాగా ఉంటారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తమ విధులను ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తారు.

సైనికుడికి లభించిన పురస్కారం ఎందుకు ప్రత్యేకం?

థామస్ ఇగ్లేసియాస్‌కు అందించిన జాయింట్ సర్వీస్ కమండేషన్ మెడల్ అనేది సైనిక సేవల్లో ప్రతిభ, విశేష కృషిని గుర్తిస్తూ ఇచ్చే పురస్కారం. సాధారణంగా ప్రాథమిక స్థాయి సైనికులకు ఈ స్థాయి గుర్తింపు లభించడం అరుదుగా భావిస్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత పెంటగాన్ చీఫ్ ప్రతినిధి సీన్ పార్నెల్ కూడా సైనికుడికి మద్దతుగా మాట్లాడారు. ఆ ప్రదేశం గౌరవాన్ని కాపాడాలని సైనికుడు సరైన రీతిలో, మర్యాదపూర్వకంగా గుర్తుచేశారని ప్రశంసించారు. హోదా ఎంత పెద్దదైనా క్రమశిక్షణ, విధి నిర్వహణకు గౌరవం ఇవ్వాలనే సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. తన విధిని నిబద్ధతతో నిర్వహించిన సైనికుడిని స్వయంగా రక్షణ మంత్రే అభినందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.