NTV Telugu Site icon

Yahya Sinwar: యాహ్యా సిన్వార్ మరణ వీడియో వైరల్.. చావు గురించి కీలక వ్యాఖ్యలు

Hamasleader

Hamasleader

ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమైన హమాస్ అధినేత యాహ్యా సిన్వార్‌కు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో తన చావు ఎలా ఉండాలో ముందుగానే డిసైడ్ చేసి చెప్పాడు. సిన్వార్ మరణాన్ని హమాస్ ధృవీకరించి.. చావుపై మాట్లాడిన పాత వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. హమాస్ అగ్రనేత ఖలీల్ అల్-హయ్యా ఈ వీడియోను పోస్టు చేశాడు.

తన చావు.. కరోనా కారణంగానో.. లేదంటే గుండెపోటుతోనో ఉండకూడదని.. శత్రువుల చేతిలో చనిపోవడమే గొప్ప బహుమతి అంటూ యాహ్యా సిన్వార్ వ్యాఖ్యానించాడు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి రెండు సంవత్సరాల ముందు సిన్వార్ మాట్లాడాడు. గుండెపోటు లేదా ప్రమాదంలో కాకుండా ఎఫ్ -16 లేదా క్షిపణుల ద్వారా చంపడానికి ఇష్టపడతానని సిన్వార్ చెప్పాడు. ‘‘నా వయస్సు 59 సంవత్సరాలు. 60 ఏళ్ళ వయసులో సహజ కారణాల వల్ల చనిపోవడానికి దగ్గరగా ఉన్నాను. అర్థరహిత మరణం కంటే అమరవీరుడుగా చనిపోవడమే నాకు ఇష్టం’’ అని సిన్వార్ అన్నారు.

‘‘వృత్తి నాకు ఇవ్వగల గొప్ప బహుమతి నన్ను చంపడమే… ఈ రోజు నాకు 59 ఏళ్లు. నిజం చెప్పాలంటే కోవిడ్‌తో, హార్ట్ స్ట్రోక్‌తో చనిపోవడం కంటే F-16 లేదా క్షిపణుల ద్వారా చంపబడాలని నేను ఇష్టపడతాను.. 60 ఏళ్ల వయస్సులో ఉన్నాను. మృత్యువుకు దగ్గరగా… అర్ధంలేని మరణం కంటే అమరవీరుడుగా చనిపోవడమే నాకు ఇష్టం.’’ అంటూ వీడియోలో సిన్వార్ మాటలు కనిపిస్తున్నాయి.

ఇజ్రాయెల్ దళాల చేతిలో చనిపోవడమే తనకిష్టమని చెప్పిన సిన్వార్.. మొత్తానికి అలానే చనిపోయాడు. గురువారం ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో సిన్వార్ హతమయ్యాడు. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడికి సూత్రధారి సిన్వారే. ఇజ్రాయెల్ హిట్‌లిస్ట్‌లో మొదటి ఉన్నది కూడా సిన్వారే. కానీ అగ్ర నాయకులంతా చనిపోయాక.. చివరిలో చనిపోయాడు. ఇప్పటిదాకా వివిధ వేషాలు ధరించి తప్పించుకుని తిరుగుతున్నాడు. మొత్తానికి ఇజ్రాయెల్ యువ దళాలు.. సిన్వార్ మట్టుబెట్టాయి.

యాహ్యా సిన్వార్ ఎవరు?
యహ్యా ఇబ్రహీం హసన్ సిన్వార్ హమాస్ నాయకుడు. ఆగస్టు 2024లో హమాస్ పొలిటికల్ బ్యూరో ఛైర్మన్‌గా ఉన్నాడు. ఇస్మాయిల్ హనియే తర్వాత ఫిబ్రవరి 2017లో గాజా స్ట్రిప్‌లో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాడు. సిన్వార్ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించాడు. ఆ సమయంలో గాజా 1962లో ఈజిప్టు పాలనలో ఉంది. ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ గాజాలో చదువుకున్నాడు. అరబిక్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. 1989లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు, నలుగురు పాలస్తీనియన్లను అపహరించి చంపినందుకు సిన్వార్‌కు ఇజ్రాయెల్ నాలుగు జీవిత ఖైదులను విధించింది. 22 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2011లో విడుదలయ్యాడు. సెప్టెంబర్ 2015లో సిన్వార్‌ను యునైటెడ్ స్టేట్స్ తీవ్రవాదిగా పేర్కొంది.