Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?

Shoaib Malik

Shoaib Malik

Shoaib Malik Fourth Marriage Rumours: పాక్‌ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. తరచూ వార్తల్లో ఉంటారు.. ఇప్పుడు మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఆయన నాలుగోసారి పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.. ముఖ్యంగా అదే దేశానికి చెందిన నటి, మోడల్ వనీజా సత్తార్‌తో షోయబ్ మాలిక్ వివాహం చేసుకోబోతున్నారని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ధృవీకరించేలా షోయబ్ మాలిక్ లేదా వనీజా సత్తార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు..

ఇక, షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారనే వదంతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఫిబ్రవరి 27న వనీజా సత్తార్‌తో ఆయన రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై ఫిబ్రవరి 28న షోయబ్ మాలిక్ స్పందిస్తూ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథనాలు అసత్యమైనవని, కల్పితమైనవని స్పష్టం చేశారు. తాను కలవని వ్యక్తులతో కూడా తన పేరును ముడిపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు తన కుటుంబంపై ప్రభావం చూపుతున్నాయని షోయబ్ మాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఇజాన్‌ కూడా భవిష్యత్తులో ఈ కథనాలను చదివే వయసులో ఉన్నాడని, ఇలాంటి ప్రచారం తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగిస్తోందని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఆపకపోతే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించిన విషయం విదితమే..

మరోవైపు వనీజా సత్తార్ కూడా ఈ పెళ్లి ప్రచారంపై స్పందించారు. ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. తాను షోయబ్ మాలిక్‌ను నిజ జీవితంలో ఎప్పుడూ కలవలేదని, ఈ వార్తలు పూర్తిగా కల్పితమైనవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం మొదలైన తర్వాత తన కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయంపై ప్రశ్నలు ఎదురయ్యాయని ఆమె వెల్లడించారు.

కాగా, షోయబ్ మాలిక్ వ్యక్తిగత జీవితంలో గతంలోనూ వివాహాలు వార్తల్లో నిలిచాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో ఆయన వివాహం జరిగింది. ఈ వివాహ బంధం ముగిసిన తర్వాత 2024లో పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు. అంతకుముందు అయేషా సిద్ధిఖీతో ఆయన వివాహం జరిగినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం సనా జావేద్‌తో విడాకులు జరిగాయని లేదా వనీజా సత్తార్‌తో కొత్త వివాహం ఖరారైందని అధికారికంగా ధృవీకరించే సమాచారం మాత్రం లేదు..