ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం భారీ భూకంపం కుదిపేసింది. అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీప తీరానికి సమీపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 7:42 గంటలకు సంభవించిన ఈ భూకంపం.. సరంగాని పట్టణానికి నైరుతి దిశగా సుమారు 21 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 65.7 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు USGS వెల్లడించింది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అలాగే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఇదే ప్రాంతంలో మూడు వారాల కిందట సంభవించిన భారీ భూకంపంలో 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. అనేక ప్రాంతాల్లో భారీ విధ్వంసం సంభవించింది.
ప్రపంచంలో అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన పసిఫిక్ ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ పరిధిలో ఫిలిప్పీన్స్ ఉండటంతో అక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సంభవిస్తుంటాయి. అందువల్ల ఇలాంటి ప్రకృతి విపత్తులు ఆ దేశంలో సాధారణంగానే చోటుచేసుకుంటుంటాయి.

