Petrol and Diesel Price Hike: పాకిస్థాన్‌లో గతంలో మోత మోగిన పెట్రో ధరలు.. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టాయని అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే. తీవ్ర ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలపై ప్రభుత్వం మరోసారి ఇంధన ధరల భారం మోపింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు సెప్టెంబర్ 15 నుంచి అంటే ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ ధరను లీటరుకు 4.42 పాకిస్థానీ రూపాయలు పెంచడంతో రూ.375.82 నుంచి రూ.380.24కి చేరింది. అదే సమయంలో హై-స్పీడ్ డీజిల్ ధరను లీటరుకు రూ.6.10 పెంచారు. దీంతో డీజిల్ ధర రూ.403.32 నుంచి రూ.409.42కి పెరిగింది.
పాకిస్థాన్ ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (OGRA) సమీక్ష అనంతరం ఇంధన మంత్రిత్వ శాఖ ఈ కొత్త ధరలను ప్రకటించింది. ఈ నెలలో వరుసగా ఆరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, ఇతర వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ధరలను ప్రభుత్వం సవరిస్తోంది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో ఇంధన ధరల సవరణ విధానంలోనూ మార్పులు చేశారు. గతంలో 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సవరించేవారు. అనంతరం వారానికి, ప్రస్తుతం రోజువారీగా ధరలను సవరించే విధానాన్ని అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు దిగుమతులపై ఆధారపడే పాకిస్థాన్‌పై ప్రభావం పడుతోంది. ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

