Site icon NTV Telugu

Pakistan: క్షిపణి పరీక్షకు పాక్ ఆదేశాలు.. భారత్ అప్రమత్తం.. ఏం జరుగుతోంది!

Pakistanmissile2

Pakistanmissile2

పహల్గామ్‌ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా క్షిపణి పరీక్షకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 24-25 తేదీల్లో అనగా గురు, శుక్రవారాల్లో ఉపరితలం నుంచి ఉపరితలం వరకు కరాచీ తీరం వెంబడి క్షిపణి పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత్ అప్రమత్తం అయింది. పాక్ చర్యలను భారత్ రక్షణ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే దౌత్యవేత్తలను ఖాళీ చేయాలని ఆదేశించింది. అలాగే పాకిస్థాన్ ఎక్స్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. ఇక కేబినెట్ భేటీలో సింధు జలాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇలా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో పాక్ భయపడింది. భయంతో గురు-శుక్రవారాల్లో క్షిపణి పరీక్ష చేయాలని పాక్ ఆదేశించింది. అరేబియా సముద్ర తీరంలో క్షిపణులను పరీక్షించాలని సంకేతాలు ఇచ్చింది. దీంతో భారత్ దర్యాప్తు సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ పరిణామాలపై నిఘా పెట్టాయి. ఇక కేంద్ర హోంశాఖ కూడా అప్రమత్తం అయింది. ఉన్నతాధికారులతో హోంశాఖ చర్చలు జరుపుతోంది.

మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఇక మృతదేహాలను అధికారులు స్వస్థలాలకు తరలించారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ నుంచి టూరిస్టులు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇక ఉగ్ర దాడికి నిరసనగా గురువారం కాశ్మీర్‌లో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. చిక్కుకున్న టూరిస్టులకు 15 రోజులు ఉచిత బస కల్పిస్తామని హోటళ్లు ముందుకొచ్చాయి.

Exit mobile version