Site icon NTV Telugu

Pakistan Army Chief Bajwa: కోట్లకు పడగలెత్తిన పాక్ ఆర్మీ చీఫ్.. ఆరేళ్లలో సున్నా నుంచి మిలియనీర్

Pakistan Army Chief Assets

Pakistan Army Chief Assets

Pakistan Army Chief Bajwa: పాకిస్తాన్‌లో అప్పులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. సంవత్సరాలు గడిచేకొద్దీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూనే వస్తోంది. అలాంటి పాక్‌లో.. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్ కమర్‌ జావేద్‌ బజ్వా కోట్లకు పడగలెత్తడం సంచలనంగా మారింది. కేవలం ఆరు సంవత్సరాల కాలంలోనే.. ఆయన కుటుంబం సంపద అమాంతం పెరిగిందని, సున్నా నుంచి మిలియనీర్స్‌గా మారిందని ఫ్యాక్ట్ ఫోకస్ అనే సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ సంస్థలో పని చేస్తున్న ఒక పాకిస్తానీ జర్నలిస్ట్.. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆర్మీ చీఫ్ కుటుంబంపై నిఘా పెట్టాడు. వారి ఆస్తులపై లోతుగా పరిశోధనలు చేసి.. తాజాగా ఆ లెక్కలన్నింటినీ బయటపెట్టాడు. ఇంకొన్ని రోజుల్లో ఆర్మీ చీఫ్‌గా బజ్వా పదవీకాలం ముగియనుండగా.. ఈ వార్తలు రావడం కలకలం రేపుతోంది.

2015లో బజ్వా సతీమణి అయేషా అంజద్‌.. తన ఆస్తుల విలువల్ని సున్నాగా ప్రకటించారు. అయితే.. ఒక్క ఏడాదిలోనే ఆమె ఆస్తులు రూ. 220 కోట్లకు చేరాయి. బజ్వా కోడలు మహనూర్‌ సాబిర్‌ ఆస్తులు సైతం విపరీతంగా పెరిగాయి. 2018 నవంబరులో బజ్వా కుమారుడితో మహనూర్‌ వివాహం జరగ్గా.. అప్పుడు ఆమె ఆస్తులు సున్నాగా ఉండగా, పెళ్లైన వారానికే రూ.127కోట్లకు పెరిగినట్లు ఫ్యాక్ట్‌ ఫోకస్‌ కథనం పేర్కొంది. ఇలా గత ఆరేళ్లలో బజ్వా కుటుంబ ఆస్తులు కోట్లకు పడగలెత్తినట్టు ఆ సంస్థ వెల్లడించింది. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు దేశ, విదేశాల్లో ఎన్నో వ్యాపారాలను ప్రారంభించారని.. లగ్జరీ ఆస్తులను కొనుగోలు చేశారని ఆ కథనం రివీల్ చేసింది. ఇస్లామాబాద్‌, కరాచీల్లో కమర్షియల్‌ ప్లాజాలు, ప్లాట్లతో పాటు లాహోర్‌లో ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని సైతం వీరు కొనుగోలు చేశారట.

ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం.. గత ఆరేళ్లలో బజ్వా కుటుంబం ఆస్తుల విలువ 12.7 బిలియన్‌ పాకిస్థానీ రూపాయలకు పైనే (అమెరికా కరెన్సీలో 56 మిలియన్‌ డాలర్లు) ఉంటుందని ఫ్యాక్ట్ ఫోకస్ కథనం బట్టబయలు చేసింది. దీంతో.. బజ్వా కుటుంబం ఈ స్థాయిలో ఆస్తులు ఎలా సంపాదించిందంటూ పాక్‌లో దుమారం రేగింది. ఓవైపు పాక్ అప్పుల్లో కూరుకుపోతుంటే.. బజ్వా ఫ్యామిలీ ఎలా కోట్లకు పడగలెత్తిందని ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఆదివారం ఈ కథనం బయటకు రాగా, ఆ వెంటనే ఈ వెబ్‌సైట్‌ని బ్లాక్ చేసేశారు.

Exit mobile version