Site icon NTV Telugu

షాకింగ్ నివేదిక‌‌.. ఒమిక్రాన్ ఎన్ని గంట‌లు స‌జీవంగా ఉంటుందంటే..?

క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతూనే ఉంది.. కొత్త కొత్త వేరియంట్లుగా విరుచుకుప‌డుతూనే ఉంది.. ప్ర‌స్తుతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తూ.. భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది.. రికార్డుల స్థాయిలో కొత్త కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి.. అయితే, ఒమిక్రాన్‌పై తాజాగా జ‌రిగిన ఓ అధ్య‌య‌నం ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను బ‌య‌ట‌పెట్టింది.. ఒమిక్రాన్ జెట్ స్పీడ్‌తో వ్యాప్తి చెంద‌డానికి కార‌ణం ఏంటి? మనిషి శరీరంపై అది ఎంత సేపు స‌జీవంగా ఉంటుంది..? ఇత‌ర వ‌స్తువుల‌పై ఎన్ని గంట‌ల పాటు బ‌తికే ఉంటుంది? అనే అంశాల‌పై కీల‌క నివేదిక‌లు వెలువ‌డ్డాయి..

Read Also: శ్రీ‌వారి భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌

ఒమిక్రాన్ ఎంత టైం స‌జీవంగా ఉంటుంది.. ఎలా వ్యాప్తిస్తోంది అనే అంశాల‌పై జపాన్‌కు చెందిన క్యోటో ప్రిఫెక్చురల్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్య‌య‌నం చేశారు.. వుహాన్‌లో పుట్టిన సార్క్‌ సీఓవీ2 ఒరిజినల్‌ వేరియంట్‌తోపాటు ఇతర వేరియంట్లపై పరిశోధనలు చేసి ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లు ఎంత సేపు జీవించి ఉంటాయ‌నేదానిపై తేల్చేశారు.. ఒరిజినల్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌.. మనిషి చర్మంపై, ప్లాస్టిక్‌పై రెండు రెట్లు అధికంగా జీవించి ఉంటుంద‌ని గుర్తించారు ప‌రిశోధ‌క‌లు.. ఇక‌, ఒమిక్రాన్‌ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నందున‌.. వ్యాప్తి అధికంగా ఉంటున్న‌ట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తంగా.. ఒమిక్రాన్‌ వేరియంట్ మ‌నిషి శ‌రీరంపై 21 గంటలపాటు స‌జీవంగా ఉంటుంద‌ని తేల్చింది.. షాకింగ్ విష‌యం ఏటంటే.. ప్లాస్టిక్‌పై ఈ వేరియంట్‌ 8 రోజులపాటు సజీవంగా ఉండ‌డం ఆందోళ‌న‌కు గురిచేసే అంశం..

ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్‌పై 8 రోజుల పాటు స‌జీవంగా ఉంటే.. అదే ఒరిజనల్‌ వేరియంట్‌ 56 గంటలు, ఆల్ఫా వేరియంట్‌ 191.3 గంటలు, బీటా వేరియంట్‌ 156.6 గంటలు, గామా వేరియంట్‌ 59.3 గంటలు, డెల్టా వేరియంట్‌ 114 గంటలు సజీవంగా ఉండ‌గా.. అన్నింటికంటే అదికంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్లాస్టిక్‌పై 193.5 గంటలపాటు సజీవంగా ఉంటుంద‌ని క్యోటో ప్రిఫెక్చురల్‌ యూనివర్సిటీ పరిశోధ‌న తేల్చింది.. ఇక మాన‌వుని శ‌రీరంపై అంటే దుస్తువుల‌పై కాకుండా చర్మంపై ఒరిజినల్‌ వేరియంట్‌ 8.6 గంటలు, ఆల్ఫా వేరియంట్‌ 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, డెల్టా 16.8 గంటలు స‌జీవంగా ఉంటే.. అన్ని వేరియంట్ల కంటే అత్య‌ధికంగా.. ఒమిక్రాన్ వేరియంట్ మ‌నిషి శ‌రీరంపై 21.1 గంటల పాటు స‌జీవంగా ఉంటుంద‌ని ఆ ప‌రిశోధ‌న‌ల‌కు సంబంధించిన నివేదిక‌లు చెబుతున్నాయి.

Exit mobile version