Site icon NTV Telugu

Anti Hijab Protest: ఇరాన్ లెక్కలు 300.. కాదు 448 అంటున్న హ్యూమన్ రైట్స్

Anti Hijab Protest

Anti Hijab Protest

More Than 300 Killed In Anti-Hijab Protests In Iran: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో మహిళలు చేస్తున్న ఆందోళనల్లో ఇప్పటివరకూ ఎందరో మరణించారు. ఈ ఆందోళనల్ని అణిచివేసేందుకు అక్కడి పోలీసులు జరిపిన కాల్పులతో పాటు ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేయడంతో, చాలామంది ప్రాణాలు విడిచారు. ఈ మరణాలపై తాజాగా ఇరాన్ ప్రభుత్వం పెదవి విప్పింది. ఇప్పటివరకూ 300 మందికి పైగా మృతి చెందినట్టు మంగళవారం వెల్లడించింది. ‘‘మహసా అమినీ మరణం.. దేశంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపింది. నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనల్లో దేశవ్యాప్తంగా చిన్నారులతో కలిపి 300 మందికి పైగా పౌరులు, సిబ్బంది మరణించి ఉండొచ్చు’ అని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్ బ్రిగేడియర్ జనరల్ అమిరాలి హజిజాదే ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఈ మృతుల్లో పోలీసులు, సైనికులు కూడా ఉన్నారన్నారు.

అయితే.. నార్వేకు చెందిన ‘ఇరాన్ హ్యూమన్ రైట్స్’ సంస్థ లెక్కలు మాత్రం ఇరాన్ తెలిపిన లెక్కలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇరాన్‌లో 448 మంది మరణించారని ఆ సంస్థ పేర్కొంది. అందులో 18 సంవత్సరాల లోపు ఉన్న 60 మంది ఉన్నారని.. వారిలో 29 మంది అమ్మాయిలు, మహిళలు ఉన్నారని వెల్లడించింది. గత వారంలోనే 16 మంది చనిపోయినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇదిలావుండగా.. సెప్టెంబరులో మాసా అమీని అనే యువతి మృతితో ఇరాన్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. ఆమె హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న ఆరోపణలతో, అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో తీవ్రంగా గాయాలపాలవ్వడంతో, ఆమె మృతి చెందిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో సెప్టెంబర్‌ 17న ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. అక్కటి నుంచి ఈ నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్రతరమయ్యాయి. అయితే.. ఈ ప్రదర్శనల్ని ఇరాన్ ‘అల్లర్లు’గా అభివర్ణిస్తూ, వాటిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది.

Exit mobile version