Mississippi River Accident : మిసిసిపీ నదిలో పెను ప్రమాదం.. క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ట్యాంకర్

  • మిసిసిపీ నదిలో అదుపుతప్పిన ట్యాంకర్.. క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టి బీభత్సం
  • ఒక్కసారిగా బోల్తాపడిన భారీ నౌక.. ప్రయాణికుల హాహాకారాలు
  • 180 మందికి పైగా ప్రయాణికుల రక్షణ.. 32 మందికి గాయాలు
  • ట్యాంకర్ స్టీరింగ్‌లో సమస్య వచ్చిందా?.. ప్రమాదంపై దర్యాప్తు
Mississippi River Accident

Mississippi River Accident

అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌లో ఉన్న మిసిసిపీ నదిలో ఒక భయానక ప్రమాదం చోటుచేసుకుంది. ఒడ్డున నిలిపి ఉంచిన ఒక భారీ ప్యాసింజర్ క్రూయిజ్ షిప్‌ను, నియంత్రణ కోల్పోయిన మరో ట్యాంకర్ నౌక బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో క్రూయిజ్ షిప్ ఒకవైపునకు ఒరిగిపోయి, క్రమంగా నదిలో బోల్తా పడింది. ప్రాణభయంతో ప్రయాణికులు రెయిలింగ్‌లను గట్టిగా పట్టుకుని వేలాడుతూ, కొందరు నీటిలో పడిపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

అసలు ఏం జరిగింది?

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం (నవంబర్ 13) మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో న్యూ ఓర్లీన్స్ పోర్ట్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ‘అమెరికన్ క్రూయిజ్ లైన్స్’ సంస్థకు చెందిన ‘అమెరికన్ హెరిటేజ్’ అనే ప్యాసింజర్ నౌక మిసిసిపీ నది ఒడ్డున నిలిపి ఉంది. ఆ సమయంలో ‘అట్లాంటిక్ ఆస్ఫాల్ట్’ అనే ట్యాంకర్ నౌక అదుపుతప్పి వచ్చి క్రూయిజ్ షిప్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన తాకిడికి ప్యాసింజర్ షిప్‌లోకి ఒక్కసారిగా నీరు చేరడంతో అది ఒక పక్కకు ఒరిగిపోయి, చూస్తుండగానే నదిలో బోల్తా పడింది.

రంగంలోకి సహాయక బృందాలు.. తప్పిన పెను ప్రాణనష్టం

ప్రమాదం జరిగిన వెంటనే అమెరికా కోస్ట్ గార్డ్, అగ్నిమాపక సిబ్బంది, హార్బర్ పోలీసులు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి భారీ సహాయక చర్యలు చేపట్టారు. షిప్ బోల్తా పడటంతో నదిలో పడిపోయి ప్రాణాలతో పోరాడుతున్న ప్రయాణికులను సహాయక బృందాలు, సమీపంలోని ఇతర పడవల్లో ఉన్న వారు వేగంగా రక్షించారు. ప్రమాద సమయంలో నౌకలో సుమారు 180 నుంచి 190 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని న్యూ ఓర్లీన్స్ మేయర్ హెలెనా మోరెనో వెల్లడించారు.

అత్యవసర బృందాల తక్షణ స్పందన వల్ల నౌకలోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటనలో 32 మంది గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరూ క్షేమంగా ఉన్నారని మేయర్ స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

స్టీరింగ్ సమస్యే కారణమా? దర్యాప్తు ముమ్మరం

ప్రమాదానికి ముందు ట్యాంకర్ నౌకలో స్టీరింగ్ సమస్య తలెత్తి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటనే దానిపై యూఎస్ కోస్ట్ గార్డ్ అధికారులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. సహాయక చర్యల దృష్ట్యా మిసిసిపీ నదిలో ఇతర నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు తమ సంస్థకు చెందిన నౌక ప్రమాదానికి గురైన మాట వాస్తవమేనని, ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించామని అమెరికన్ క్రూయిజ్ లైన్స్ ప్రకటించింది. నదిలో నౌకల భద్రతపై ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.