మెక్సికో దక్షిణ తీరాన్ని శుక్రవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప ప్రభావం మెక్సికోతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ దేశాల్లోనూ తీవ్రంగా కనిపించింది. అమెరికా భూకంప పరిశోధన సంస్థ (USGS) తెలిపిన వివరాల ప్రకారం.. మెక్సికోలోని ప్యూర్టో మాడెరో నగరానికి సమీపంలో భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. తక్కువ లోతులో సంభవించడం వల్ల భూమి తీవ్రంగా కంపించడంతో పాటు సునామీ ప్రమాదం కూడా పెరిగిందని అధికారులు తెలిపారు.
సునామీ హెచ్చరికలు
భూకంపం అనంతరం అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ అప్రమత్తమైంది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలకు సునామీ ముప్పు ఉన్నట్లు హెచ్చరించింది. మెక్సికో, గ్వాటెమాలా తీరాల్లో సాధారణ అలల కంటే ఒక మీటర్ వరకు ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధాన భూకంపం తర్వాత పలు ఆఫ్టర్‌షాక్‌లు నమోదయ్యాయి. వాటిలో అత్యంత బలమైనది 6.1 తీవ్రతతో నమోదైంది. అదనంగా 5.2, 4.5 తీవ్రతలతో మరికొన్ని ప్రకంపనలు సంభవించినట్లు భూకంప పరిశీలనా సంస్థలు వెల్లడించాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనాలు బలంగా ఊగిపోవడం, గోడలపై ఉన్న వస్తువులు కిందపడిపోవడం కనిపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్వాటెమాలా రాజధాని గ్వాటెమాలా సిటీలో కూడా భవనాలు కంపించడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎల్ సాల్వడార్‌లోనూ భూకంప ప్రకంపనలు స్పష్టంగా నమోదయ్యాయి.
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ మాట్లాడుతూ.. చియాపాస్, టబాస్కో రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని తెలిపారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవాలో కూడా ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదుకాలేదని, పరిస్థితిని నిమిషానికోసారి పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
భూకంప శాస్త్రవేత్తల ప్రకారం 7.4 తీవ్రతతో సంభవించే భూకంపాలు ‘మేజర్ ఎర్త్‌క్వేక్’గా పరిగణిస్తారు. ఇలాంటి భూకంపాలు పెద్ద ఎత్తున విధ్వంసానికి కారణమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

