NTV Telugu Site icon

పాకిస్థాన్‌లో దారుణం.. ఆటోలో వెళుతున్న మహిళపై దాడి !

అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ల చేతిలోకి వెళ్లిందనగానే భయపడిపోతున్నారు అక్కడి మహిళలు. అయితే, పాకిస్థాన్‌లో కూడా దాదాపు అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇటీవల వెలుగు చూస్తున్న వీడియోలు పాకిస్థాన్‌లోని వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లాడితో ఆటోలో వెళ్తుంటే వాళ్లను బైక్స్‌పై వెంటపడి వేధించాయి అల్లరి మూకలు. ఇంతలో ఓ యువకుడు ఏకంగా ఎక్కి ఓ మహిళకు ముద్దుపెట్టాడు. దీంతో ఆమె భయంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా వాళ్లను వేధించడం ప్రారంభించారు యువకులు. దీంతో ఆటోలోని రెండో మహిళ తన కాలి చెప్పును తీసి తమ జోలికి వస్తే చెప్పుతో కొడతానని ఆ యువకులకు వార్నింగ్‌ ఇచ్చింది. ఇంత జరుగుతున్నా బాధితులకు అండగా ఒక్కరూ నిలబడలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. వీడియో కొంత మంది చేతుల్లో పాకిస్థాన్‌ జెండాలున్నాయి. దీనిని బట్టి పాక్‌ స్వతంత్ర దినోత్సవమైన ఆగస్టు 14న ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు పాకిస్థాన్‌లో పరిస్థితులపై రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు.