Laika sacrifice: ఇప్పుడంటే, ప్రతీ దేశం తమ వ్యోమగాముల్ని అంతరిక్షానికి పంపాలని అనుకుంటోంది. అమెరికా, రష్యా, యూరప్ దేశాలు ఎంతో సులభంగా తమ వ్యోమగాముల్ని అంతరిక్షానికి పంపుతున్నారు. మళ్లీ వారిని సేఫ్‌గా భూమి పైకి తీసుకువస్తున్నారు. 68 ఏళ్ల క్రితం ఒక చిన్న వీధి కుక్క లేకపోతే, దాని త్యాగం లేకుంటే మానవుడు అంతరిక్షానికి వెళ్లే సాహసం చేసే వాడా..?, ‘‘లైకా’’ అనే కుక్క అంతరిక్షంలో తన ప్రాణాలను త్యాగం చేసి, మానవుడికి అంతరిక్షాన్ని దగ్గర చేసింది.
68 ఏళ్ల క్రితం, నవంబర్ 3,1957న మాస్కో వీధుల నుంచి తీసుకువచ్చిన ఒక చిన్న వీధి కుక్క చరిత్ర సృష్టించింది. సమస్త మానవాళి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది. సోవియట్ యూనియన్ అంతరిక్ష నౌక స్పుత్నిక్ 2లో ప్రయాణించి, భూమి చుట్టు ప్రదక్షిణ చేసిన మొదటి జీవిగా నిలిచింది. లైకా అంతరిక్ష ప్రయాణం, అది తిరిగి మళ్లీ తిరిగి రావడానికి రూపొందించలేదు. సోవియట్ యూనియన్, అమెరికా మధ్య తీవ్రమైన అంతరిక్ష పోటీలో లైకా త్యాగం ఎంతో విలువైంది.
Read Also: Haris Rauf ICC Ban: పాకిస్థాన్ ప్లేయర్ హరిస్ రవూఫ్‌కు ఐసీసీ షాక్.. సూర్యకు కూడా! ఎందుకో తెలుసా..
కేవలం 6 కిలోలు ఉన్న లైకాను అంతరిక్ష నౌకలో అత్యంత ఇరుకు ప్రాంతంలో జీవించేలా శిక్షణ ఇచ్చారు. సోవియట్ శాస్త్రవేత్తలు దానిని ఎన్నో పరీక్షలకు గురిచేశారు. దానిని సెంట్రిఫ్యూజ్‌లో ఉంచి నౌక వేగానికి అనుగుణంగా రూపుదిద్దుకునేలా చేశారు. బరువు లేని స్థితిలో తినగలిగే జెల్లీ లాంటి అంతరిక్షంలో ఇచ్చే ఆహారాన్ని దానికి అందించారు. స్పుత్నిక్ 1 విజయవంతం అయిన నెల తర్వాత, స్పుత్నిక్ 2ను ప్రయోగించారు. అంతరిక్షంలో పరిస్థితులు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికే శాస్త్రవేత్తలు లైకాను శూన్యంలోకి పంపించారు. దీనిని పరీక్షించిన 4 ఏళ్ల తర్వాత, యూరీగగారిన్‌ను అంతరిక్షంలోకి పంపాలని భావించింది. లైకా ద్వారా అంతరిక్షంలోని పరిస్థితులు జీవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలని అనుకున్నారు.
విషాదకర మరణం:
లైకాను ఒక క్యాప్సూల్‌లో ఉంచి, అంతరిక్షంలోకి పంపారు. దాని హృదయస్పందన, శ్వాస, కదలికల్ని టెలిమెట్రీ వ్యవస్థల ద్వారా పర్యవేక్షించారు. ఒక చిన్న కెమెరా ద్వారా కక్ష్యలో లైకా ఫోటోను తీశారు. ప్రారంభంలో లైకా అంతరిక్షంలో చాలా రోజలు బతికి ఉందని సోవియట్ యూనియన్ పేర్కొంది. కానీ దశాబ్ధాల తర్వాత అసలు విషయం తెలిసింది. క్యాబిన్ కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ కావడంతో, లైకా వేడెక్కి, ఒత్తిడికి గురై గంట్లలోనే మరణించినట్లు తేలింది. లైకా త్యాగం వ్యోమగాములందరికి అంతరిక్ష మార్గాన్ని తెరిచింది. దాని త్యాగానికి ఇప్పటికీ గౌరవించబడుతోంది. మాస్కోలో లైకా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి, ఇప్పటికీ దాని త్యాగాన్ని గౌరవిస్తున్నారు.
