Japanese Companies Set To Introduce Office Nap Boxes: ఆఫీసులో కొందరు అప్పుడప్పుడు కునుకు తీస్తుంటారు. ముఖ్యంగా.. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ‘కారు మబ్బులు ఒక్కసారిగా కమ్మేసినట్టు’.. కళ్లు మూసుకుపోతుంటాయి. ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే, నిద్ర మత్తు అంత త్వరగా వదలదు. అలాంటి వారి కోసమే జపాన్‌లోని టోక్యోకి చెందిన కొయొజు ప్లైవుట్ కార్పొరేషన్ సంస్థ ‘న్యాప్ బ్యాక్స్’లను రూపొందించింది. కాసేపు కును తీసేంత సౌకర్యవంతంగా వీటిని తయారు చేసింది.
సాధారణంగానే జపాన్‌లోని ఆఫీసులు తమ ఉద్యోగులకు కాసేపు నిద్రపోవడానికి అమనుతులు ఇస్తుంటాయి. పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వారు పడుకోవచ్చు. దీనినే పవర్ న్యాప్ అంటారు. అలా కాసేపు విశ్రాంతి తీసుకుంటే.. పునరుత్తేజం పొంది, బాగా పని చేస్తారన్నది వారి భావన. పవర్ న్యాప్ తర్వాత ఒత్తిడి, అలసట పూర్తిగా తగ్గి.. ఉత్సాహంగా పని చేయగులుగుతారని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. అందుకే.. జపాన్‌లో ఉద్యోగులు లంచ్ సమయంలో గానీ, ఆ తర్వాత పని మధ్యలో గానీ పది, ఇరవై నిమిషాలు కునుకు తీస్తుంటారు. వారికి అనుగుణంగా ఉండేందుకే న్యాప్ బాక్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
శరీరానికి పూర్తి విశ్రాంతినిచ్చేలా, నిలబడే కునుకు తీయగలిగేలా ఈ న్యాప్ బాక్స్‌లను రూపొందించారు. ఈ న్యాప్ బాక్స్‌లకు స్థానిక భాషలో ‘కమిన్ బాక్స్’లుగా ఆ సంస్థ పేరు పెట్టింది. వీటిని నిలువుగా తయారు చేయడానికి కారణం.. ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఏ మూలలో అయినా ఫిట్ అవుతాయి. పలితంగా.. ఆఫీసులో అదనంగా స్థలం వృధా అవ్వదు. అయితే.. నెటిజన్లు మాత్రం ఇవి మరీ శవపేటికలా ఉన్నాయని, వీటి బదులు బెడ్‌లాంటిది తయారు చేసుంటే బాగుండేదన్న అసంతృప్తుల్ని వ్యక్తపరుస్తున్నారు.
