Site icon NTV Telugu

Shinzo Abe: జపాన్‌కి ఎక్కువ కాలం, నాలుగు సార్లు ప్రధానిగా చేసిన షింజో అబే

Shinzo Abe

Shinzo Abe

షింజో అబే.. జపాన్‌ మాజీ ప్రధానమంత్రి. లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్షుడు. 2006-07లో ఏడాది పాటు, 2012-2020లో 8 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. తద్వారా జపాన్‌కి ఎక్కువ కాలం (మొత్తం నాలుగు సార్లు) ప్రధానమంత్రిగా చేసిన ఘనత వహించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌కి ప్రధాని అయిన పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పారు. ప్రధాని కాకముందు 2005-06లో క్యాబినెట్‌ చీఫ్‌ సెక్రెటరీగా వ్యవహరించారు. 2012లో కొన్నాళ్లపాటు ప్రతిపక్షనేతగానూ పనిచేశారు. మొదటిసారి 1993 ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2006లో తొలిసారి, 2012లో రెండోసారి ఎల్‌డీపీ ప్రెసిడెంట్‌ అయ్యారు. 2014, 2017ల్లో వరుసగా రెండు ఎన్నికల్లో పార్టీని విజయబాటలో నడిపారు. రెండు సార్లూ అనారోగ్య కారణాలతోనే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.

షింజో అబే 1954 సెప్టెంబర్‌ 21న జపాన్‌ రాజధాని టోక్యోలోని పేరొందిన రాజకీయ, సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తాతముత్తాతలు కూడా మంత్రులుగా చేసినవారే కావటం గమనార్హం. షింజో అబే పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులు చదివారు. అమెరికాలో విద్యనభ్యసించారు. పాతికేళ్ల వయసులో (1979లో) కోబ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేసిన తర్వాత (1982లో) బయటికొచ్చి ప్రభుత్వంలో, పార్టీలో వివిధ పదవులు చేపట్టారు. 11 ఏళ్ల అనంతరం 1993లో తొలిసారి జపాన్‌ ప్రతినిధుల సభలో అడుగుపెట్టారు. 13 ఏళ్ల తర్వాత ప్రధాని అయ్యారు. 1987లో అకీ మత్సుజాకీని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లల్లేరు. సంతాన సాఫల్య చికిత్సలు చేయించుకున్నా ఫలితం దక్కలేదు.

జపాన్‌ ప్రధానిగా షింజో అబే తనదైన ముద్ర వేశారు. ఆయన ఆర్థిక విధానాలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. ఆ దేశ “ఎకనమిక్స్‌”ని కాస్తా “అబెనొమిక్స్‌”గా ప్రపంచ దేశాలు అభివర్ణించాయి. 2013లో టాప్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ ప్రాజెక్టు అనే ప్రోగ్రామ్‌ ప్రారంభించారు. ఈ పదేళ్ల పథకంలో భాగంగా జపాన్‌ విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల, అధ్యాపకుల సంఖ్యను పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కొన్ని యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్‌ యూజీ ప్రోగ్రామ్సే బోధించేందుకు నిధులు అందజేశారు. 2014లో మ్యారేజ్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌ని చేపట్టారు. మిలియన్‌ డాలర్లు కేటాయించారు. బ్రహ్మచారులు తమకు తగిన జోడీని ఎంచుకునేందుకు, దేశంలో పడిపోతున్న జననాల రేటును పెంచేందుకే ఈ పథకాన్ని చేపట్టారు. విదేశీ వ్యవహారాల్లో రాజనీతిని ప్రదర్శించారు. మన దేశానికి జపాన్‌ని మిత్ర దేశంగా మలిచారు. ఇతర దేశాలతోనూ స్వాతంత్ర్య, ప్రజాస్వామ్య, మానవ హక్కుల, చట్టబద్ధమైన సంబంధాలను నెరిపారు.

Exit mobile version