న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. గల్ఫ్ ప్రాంత పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో రష్యా, ఇరాన్‌పై అమెరికా తీసుకొచ్చిన ఆంక్షల చట్టంపై భారత్ తన “ప్రయోజనాలు, ఆందోళనలను” మరోసారి స్పష్టం చేసినట్లు జైశంకర్ తెలిపారు.
భేటీ అనంతరం జైశంకర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. “యూఎన్ హై-లెవల్ వీక్ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను కలవడం ఆనందంగా ఉంది. Sanctioning Russia and Iran Act (SRIA)కు సంబంధించి భారత్ ప్రయోజనాలు, ఆందోళనలను మరోసారి తెలియజేశాను. గల్ఫ్, ఉక్రెయిన్ పరిస్థితులపై కూడా చర్చించాం” అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026పై సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా రష్యా నుంచి చమురు, గ్యాస్ వంటి ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి అదనపు ఆర్థిక చర్యలు తీసుకునే అధికారం లభించింది. ఈ చట్టం కింద రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాల దిగుమతులపై గరిష్ఠంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. అయితే అలాంటి టారిఫ్‌లు చట్టం ఆమోదంతో ఆటోమేటిక్‌గా అమల్లోకి రావు. రష్యా ముడి చమురును పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్, చైనా ఉండటంతో ఈ అంశం న్యూఢిల్లీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్ ఆందోళన ఏంటి?
ఈ చట్టం వల్ల భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం ఉండొచ్చని భారత్ ఇప్పటికే అమెరికాకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుని వివిధ దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటామని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. భారత్ ఈ చట్టంలోని నిబంధనలను పరిశీలిస్తోందని, దేశ ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం తెలిపింది.
రూబియోతో చర్చ
జైశంకర్, రూబియో భేటీలో రష్యా ఆంక్షల చట్టంతో పాటు గల్ఫ్ ప్రాంత పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధంపైనా చర్చ జరిగింది. రూబియో కూడా భేటీ అనంతరం భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, కీలక ప్రాంతీయ అంశాలు, రాబోయే బహుపాక్షిక సమావేశాలపై ఇరు దేశాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్-అమెరికా సంబంధాల్లో వాణిజ్యం, రష్యా చమురు దిగుమతులు, ఇంధన భద్రత వంటి అంశాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. జైశంకర్-రూబియో భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
Good to meet @SecRubio of the US #UNHighLevelWeek
Reiterated India’s interests and concerns with regard to SRIA. Also discussed the Gulf and Ukraine situations.
🇮🇳 🇺🇸 https://t.co/163YRVlMZG
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 23, 2026

