Italian PM Mario Draghi Resigns After Government Implodes: ఇటలీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆయా పార్టీల మద్దతుని కూడగట్టడంలో ప్రధానమంత్రి మారియో డ్రాఘి విఫలమవ్వడంతో.. ఆయన గురువారం రాజీనామా చేశారు. ఈయన రాజీనామాను ఆ దేశ అధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా అంగీకరించారు. తదుపరి ప్రధాని ఎన్నికయ్యేంతవరకూ డ్రాఘి అపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో అక్కడ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అసలేం జరిగిందంటే.. ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్, ఫోర్జా ఇటాలియా, యాంటీ ఇమ్మిగ్రాంట్ లీగ్, డెమోక్రటిక్ పార్టీ, ఆర్టికల్ వన్ మొదలైన పార్టీల భాగస్వామ్యంతో మారియో డ్రాఘి నేతృత్వంలోని జాతీయ ఐక్య ప్రభుత్వం ఏర్పడింది. అయితే.. ఇంధర, ఆర్థిక సంక్షోభం, ఉక్రెయిన్‌కు తోడ్పాడు విషయాల్లో ఈ పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఫైవ్ స్టార్ మూమెంట్ పార్టీ, డ్రాఘి ప్రభుత్వానికి తన మద్దతుని ఉపసంహరించుకుంది. ఆ సమయంలోనే డ్రాఘి తన రాజీనామాని ప్రకటించారు. కానీ, దేశాధ్యక్షుడు మత్తరెల్లా దాన్ని తిరస్కరించారు.
ఈ నేపథ్యంలోనే విశ్వాస పరీక్ష నిర్వహించగా.. ఫోర్జా ఇటాలియా, యాంటీ ఇమ్మిగ్రాంట్ లీగ్‌లు సైతం ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ దెబ్బకు డ్రాఘికి మెజారిటీ దక్కలేదు. దీంతో ఆయన రెండోసారి రాజీనామా చేయగా, అందుకు దేశాధ్యక్షుడు ఆమోదం తెలిపారు. కాగా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మాజీ అధిపతి అయిన డ్రాఘి.. అధ్యక్షుడి సూచనల మేరకు 2021లో ఐదు పార్టీల మద్దతుతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతలోనే రాజకీయ సంక్షోభం ముదరడం, మద్దతు లేకపోవడంతో.. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.
