Iran protests: ఇరాన్ వ్యాప్తంగా సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి. వందలాది మందిని అక్కడి పాలకులు చంపుతున్నప్పటికీ, ప్రజలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరసనల్ని ఎలాగైనా అణిచివేయాలని అక్కడి మత పాలకుడు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, అమెరికా ఇరాన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ట్రంప్ ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను ప్రకటించారు.
ఇరాన్ నిరసనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇరాన్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం తన పౌరులకు వెంటనే దేశం విడిచి వెళ్లాలని సలహా జారీ చేసింది. యూఎస్ పాస్‌పోర్టు కలిగిన, యూఎస్‌తో సంబంధాలు ఉన్న వారిని ఇరాన్ అధికారులు నిర్బంధించే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెరికా ఎంబసీ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని గుర్తించడని, అమెరికా-ఇరాన్ జాతీయత కలిగిన వారిని ఇరాన్ తన పౌరులుగానే పరిగణిస్తుందని, వీరిని నిర్బంధించే అవకాశం ఉందని, ఇరాన్ పాస్‌పోర్టుతోనే దేశం విడిచి పెట్టాలని యూఎస్ సూచించింది. ఇరాన్‌లో ఉన్న యూఎస్ పౌరుల్ని నిర్బంధించి, విచారించే అవకాశం ఉందని చెప్పింది.
మరోవైపు, యూఎస్ తన పౌరులకు సెక్యూరిటీ అలర్ట్ పంపించడాన్ని చూస్తే ట్రంప్ దాడికి సిద్ధమవుతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌లో నిరసనకారుల్ని అణిచివేస్తే, తీవ్రమైన దాడి ఉంటుందని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఇటీవల, వెనిజులాలో దాడి చేసి నికోలస్ మదురో అరెస్ట్‌లో పాలుపంచుకున్న డెల్టా ఫోర్స్ ఇరాన్ సమీపంలో ఉన్న అమెరికన్ బేస్‌లలో ఉన్నట్లు తెలుస్తోంది.
